May 10,2023 08:13
  • పదేళ్లయినా దాటవేతే
  • ప్యాక్స్‌ ప్రైవేటీకరణ తర్వాతేనా ?
  • జిల్లాల వర్గీకరణా సమస్యే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రంలో సహకార ఎన్నికలు నిర్వహించి పదేళ్లు దాటింది. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు కోఆపరేటివ్‌ ఎలక్షన్లను దాట వేశాయి. ఎన్నికల్లేకుండా అనధికారిక వ్యక్తులతో కమిటీలను నియమించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. అధికార పార్టీలలోని రాజకీయ నిరుద్యోగులకు సహకార సంస్థలను అడ్డాలుగా మార్చేయడం ఒక ఎత్తు కాగా, చట్టాల్లో, బైలాస్‌లో తమకు అనుకూల మార్పులు, సవరణలకు ఈ కమిటీలను వాడుకుంటున్నాయి. ఈ వ్యవహారం సహకార స్ఫూర్తికి విరుద్ధమని సహకార ఉద్యమ కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

                                                            ఉమ్మడి రాష్ట్రంలోనే...

సహకార ఎన్నికలు చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో 2013 జనవరిలో జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత 2018 జనవరితో సంస్థల పాలకవర్గాలకు గడువు ముగిసింది. అప్పటి టిడిపి సర్కారు ఉనికిలో ఉన్న పాలక బోర్డులను ఆర్నెల్ల చొప్పున రెండు సార్లు గడువు పొడిగించింది. వైసిపి సర్కారు వచ్చాక ముగ్గురు చొప్పున అనధికారిక వ్యక్తులతో కమిటీలు వేసి, వారిలో ఒకరిని ఛైర్మన్‌గా నియమిస్తోంది. ఆ విధంగా నాలుగేళ్లుగా కమిటీలు వేస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్‌్‌) ఎన్నికలతో డిసిసిబిలు, ఆప్కాబ్‌తో సంబంధం ఉంటుంది. డిసిఎంఎస్‌లు, మార్క్‌ఫెడ్‌ పాలక వర్గాలు ఏర్పడాల్సింది ప్యాక్స్‌లతోనే. ఎఎంసిలలోనూ వాటి పాత్ర ఉంటుంది. రైతుల అజమాయిషీలో నడిచే ఇంత ముఖ్యమైన సొసైటీలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో సహకార వ్యవస్థ నిర్వీర్యానికి ప్రభుత్వమే కారణమవుతోంది.
 

                                                            ఈ టర్మ్‌లో లేనట్లేనా ?

ప్యాక్స్‌ ప్రక్షాళన పూర్తయ్యాకనే ఎన్నికలు పెడతామని తొలుత ప్రభుత్వం చెప్పింది. ప్యాక్స్‌లో 50 శాతం ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానించింది. ప్రొఫెషనల్స్‌కు ఓటింగ్‌ హక్కు, పదవులు ఇచ్చేందుకు నిబంధనలు మార్చింది. ఆర్‌బికెలను ప్యాక్స్‌్‌లో కలిపింది. సిబ్బందికి వేతన పాలసీ అంటోంది. ప్రభుత్వ విధానంపై ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల విభజన సహకార ఎన్నికలకు ప్రతిబంధకంగా మారింది. డిసిసిబిలు, డిసిఎంఎస్‌ల పరిధులు మారాయి. ఇప్పటి వరకు కొత్త జిల్లాలకు డిసిసిబిల అంశం ఆర్‌బిఐ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ సమస్యలను చూపించి సహకార ఎన్నికలు ఈ టర్మ్‌లో నిర్వహించడం సాధ్యం కాదన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కాగా రాష్ట్రంలో 2,046 ప్యాక్స్‌ ఉన్నాయి. వాటిలో 46 లక్షల మంది ఓటర్లు, 25 లక్షల మంది వరకు వివిధ రకాల సర్వీసులు పొందేవారు ఉన్నారు. కేంద్రం ప్యాక్స్‌ను కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా మారుస్తామని ప్రైవేటుకు ద్వారాలు తెరిచింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు వంత పాడుతోంది. మల్టీపర్పస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లంటోంది.