May 02,2023 13:13

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పలు పల్లపు ప్రాంతాల్లోని పంట సేలు నీట మునిగింది. దీంతోపాటు ఇప్పటికే కోతలు కోసిన ధాన్యం ఎండబెట్టుకోవడానికి లేక నీళ్లలో నానుతున్నాయి. ఈ మేరకు కే.గంగవరం మండలంలోని శివల గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి బి.రవి సిబ్బందితో వెళ్లి మంగళవారం ఉదయం పరిశీలించారు. నీట మునిగిపోయిన పంట మొలకెత్తుతుందని రైతులు వ్యవసాయ అధికారులకు చూపించారు. తడిసిన ధాన్యం రాశులను కూడా అధికారులు పరిశీలించారు. పంటచేలలో ఉన్న వాననీరును వెంటనే మురుగు కాలువలలోనికి మళ్లించుకోవాలని, తడిసిన ధాన్యాన్ని పై భాగాన జాగ్రత్తగా తీసుకుని భద్రపరుచుకుని ఆరబెట్టుకోవాలని అధికారి రైతులకు సూచించారు. బాగా తడిసిన ధాన్యాన్ని వేరేచోట ఆరబెట్టుకోవాలని, విడివిడిగా ఆరబెట్టుకోవడం వల్ల రంగు మారిన ధాన్యం తొలగించుకునేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. బాగా నీట మునిగిన పంట పొలాల్లో ధాన్యం మొలకెత్తకుండా ఉప్పు ద్రావణాన్ని చల్లుకుంటే ఫలితం ఉంటుందని వివరించారు. మరో రెండు రోజులపాటు వరి కోతలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. వాతావరణం కాస్త తెరుపునివ్వడంతో నిన్న రైతులంతా పొలాల్లో ఉన్న వాన నీటిని మళ్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.