Nov 23,2020 21:15

జెరూసలెం : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో రహస్య మంతనాలు సాగించారని మీడియా తెలిపింది. ఇజ్రాయిల్‌ ప్రధాని సౌదీకి వెళ్లడం ఇదే ప్రథమం. గత వారం ఇజ్రాయిల్‌లో వున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా ఈ చర్చల్లో పాల్గన్నట్లు సమాచారం. నెతన్యాహు, గూఢచారి సంస్థ మొసాద్‌ అధిపతి యోసి కొహెన్‌లు ఆదివారం సౌదీ అరేబియాకు వెళ్ళి పాంపియోను, మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను కలుసుకుని నియోమ్‌ నగరంలో చర్చలు జరిపినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇజ్రాయిల్‌ అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్‌కు చెందిన ఇతర మీడియా సంస్థలు కూడా ఇదే సమాచారాన్ని అందించాయి. ఈ వార్తలపై స్పందించడానికి నెతన్యాహు కార్యాలయం అందుబాటులోకి రాలేదు. గల్ఫ్‌లోని సౌదీ మిత్రపక్షాలైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవడానికి చారిత్రక ఒప్పందాలకు ఇజ్రాయిల్‌ అంగీకరించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇజ్రాయిల్‌తో మరిన్ని అరబ్‌ దేశాలు సంబంధాలు పెట్టుకుంటాయని అమెరికా, ఇజ్రాయిల్‌ పదే పదే సూచనప్రాయంగా చెబుతూ వస్తున్నాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలు పెట్టుకోరాదన్న దశాబ్దాల నాటి అరబ్‌ లీగ్‌ వైఖరికే తాము కట్టుబడి వున్నామని బహిరంగంగా సౌదీ అరేబియా చెబుతోంది.