లండన్ : బ్రిటన్ రాజుగా చార్లెస్-3కి వచ్చే నెల 6న జరగనున్న పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన రాజకుటుంబానికి 10 వరుసల అవతల కూర్చుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాచరికాన్ని వదులుకుని అమెరికాలో స్థిరపడిన ఆయనకు ఈ వేడుకలో తగిన ప్రాధాన్యం దక్కకపోవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో తన కుటుంబంతో రాజీపడే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆయన తండ్రి, సోదరుడు విలియంలతో రాజీపడే అవకాశం లేదని అన్నారు. వారితో మాట్లాడే సమయం కూడా ఉండకపోవచ్చని అన్నారు. ఆయనకు విండ్సర్స్ నుంచి తగిన ఆదరణ లభించకపోవచ్చని తాను భావిస్తున్నానని చెప్పారు. తండ్రి కోరిక మేరకు హ్యారీ ఈ వేడుకకు హాజరుకానున్నాడని అన్నారు. ఈ పట్టాభిషేక కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. అయితే హ్యారీ.. పట్టాభిషేకాని మాత్రమే హాజరై తిరిగి వెళ్లిపోనున్నారని సమాచారం. క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత.. కింగ్ ఛార్లెస్ రాజుగా బాధ్యతలను స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం మాత్రం మే 6న జరగనుంది. 1066లో కింగ్ విలియం 1 అనంతరం సెంట్రల్ లండన్ చర్చిలో పట్టాభిషేకం నిర్వహించనున్న 40వ చక్రవర్తి ఛార్లెస్ కానున్నారు.