లండన్ : జూన్ 2015 నుంచి జూన్ 2016 మధ్య కాలంలో వాయువ్య ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేసే లూసీ లెట్బీ (33) అనే నర్సు ఏడుగురు నవజాత శిశువుల్ని హత్య చేసింది. అలాగే మరో ఆరుగురి శిశువుల్ని చంపేందుకు ప్రయత్నించిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అనారోగ్యంతో లేదా నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు ఇంజెక్ట్ చేసి, లేదా వారికి ఎక్కువ పాలు తాపించి, ఇన్సులిన్‌తో విషపూరితం చేసి శిశువుల్ని చంపిందని ఆమెపై ఆ ఆసుపత్రి యాజమాన్యం ఆరోపించింది. గతంలో ఈమెను రెండుసార్లు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను విడుదల చేశారు. అయితే ఆమెను 2020లో మూడవసారి పోలీసులు అరెస్టు చేసి కస్టడీలో ఉంచారు. ఈ కేసుపై ఉత్తర ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్ట్‌లో వాదనలు జరిగాయి. ఈమె తరపున బారిస్టర్ బెన్ మైయర్స్ వాదించారు. లూసీ తనకు అప్పగించిన పనిని ఎంతో ఇష్టపడి.. నిబద్ధతతో కష్టపడి పనిచేసేది అని కోర్టుకు బెన్ తెలిపారు. ఆమె విధుల్లో ఉన్నప్పుడు చనిపోయిన శిశువులు అందరూ నెలలు నిండకుండానే జన్మించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కూడా చాలా తక్కువగానే ఉన్నారు. అని బెన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో లూసీ నలుగురు సీనియర్ వైద్య బృందం తమ ఆసుపత్రి వైఫల్యాలను కప్పిపుచ్చడానికే తనపై నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విచారణలో లూసీ తన సహోద్యోగులకు పంపిన మెసేజ్‌ల ద్వారా ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది. 22రోజులపాటు జరిగిన వాదనలు అనంతరం కోర్టు ఆగస్టు 18 శుక్రవారం లూసీనే హంతకురాలిగా కోర్టు నిర్ధారించింది. సోమవారం కోర్టు ఆమెకు శిక్షను ఖరారు చేయనుంది.
కాగా, నర్సుగా ఉండి.. శిశువుల్ని కాపాడాల్సిందిపోయి.. ఆమె వారి ప్రాణాల్ని తీసింది. వైద్యులు ఆమెపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేసి ద్రోహం చేసింది అని సీనియర్ ప్రాసిక్యూటర్ పాస్కేల్ జోన్స్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే తన వృత్తికి పూర్తి ద్రోహం చేసింది అని ఆ ఆసుపత్రికి చెందిన డాక్టర్ రవి జయరామ్ మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా రవి.. పోలీసులు అప్రమత్తమై ఉంటే.. శిశువులు హత్యకు గురయ్యేవారు కారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.