- బ్రిటన్ సంక్షోభం ఎఫెక్టు
- ఉప ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ
లండన్ : ఇటీవల మూడు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడేళ్ల క్రితం స్వీప్ చేసిన ఈ మూడు స్థానాల్లో రెండింటిని ఇప్పుడు ఆ పార్టీ కోల్పోయింది. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రాతినిధ్యం వహించిన నార్త్ వెస్ట్ లండన్ స్థానంలో స్వల్ప ఆధిక్యతతో అది బయటపడింది. సెల్బీ, ఎయిన్‌స్టీ స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ భారీ మెజార్టీతో గెలుచుకోగా, సామర్టన్ అండ్ ఫ్రోమ్ స్థానాన్ని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ చేజిక్కించుకుంది. మొత్తం మీద ఈ ఫలితాలు అక్కడి సంక్షోభ తీవ్రతను తెలియజేస్తున్నాయి. టోరీ పార్టీ (కన్సర్వేటివ్స్‌కు మరో పేరు) కోల్పోయిన రూరల్ స్థానాలు రెండూ ఆ పార్టీకి గుండెకాయలాంటివి. అటువంటి స్థానాల్లో చిత్తుగా ఓడిపోవడం అధికార పార్టీపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చాలామంది టోరీ ఓటర్లు ఎన్నికల పోలింగ్ రోజున ఓటు వేయడానికి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఇది కన్సర్వేటివ్ పార్టీ పట్ల వారిలో నెలకొన్న నిర్లిప్తతకు ఒక మచ్చుతునక. 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 20, 532 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఫలితంగా టోరీలకు పోలైన ఓట్లు గతంతో పోల్చితే 21, 700 దాకా తగ్గాయి. లేబర్ పార్టీకి 3,000 ఓట్ల దాకా తగ్గాయి. లిబరల్ డెమొక్రాట్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ ప్రభుత్వం బ్యాంకుల, బహుళజాతి సంస్థలకు తాబేదారుగా వ్యవహరించడం, వాటర్ కంపెనీల ప్రైవేటీకరణ, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం, నిజ వేతనాలు పడిపోవడం వెరసి ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దిగజారాయి. కన్సర్వేటివ్స్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలిగే స్థితిలో లేబర్ పార్టీ లేదు. తాము అధికారంలోకి వస్తే వేతనాలను సవరిస్తామని, ధరలు తగ్గిస్తామని, పర్యావరణాన్ని కాపాడతామని స్పష్టమైన హామీ ఇవ్వడానికి అది సిద్ధంగా లేదు. సరైన ప్రత్యామ్నాయంతో లేబర్ పార్టీ గనుక ముందుకు వస్తే బ్రిటన్ ప్రజలు దానిని తప్పక ఆదరిస్తారు. ఇప్పుడున్న లేబర్ పార్టీ నాయకత్వానికి అటువంటి సామాజిక దృక్పథమేదీ ఉన్నట్లు కనిపించడం లేదు.