రాంచి : గిరిజనులకు సర్నా మతపరమైన కోడ్‌ను గుర్తించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం మూడు పేజీల లేఖ రాశారు. గత ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలో గిరిజనుల జనాభా 38శాతం నుండి 26శాతానికి క్షీణించిందని సోరెన్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూళ్ళ కింద గిరిజనుల అభివృద్ధి కోసం రూపొందించే విధానాలపై గిరిజనుల జనాభా తగ్గడమనేది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. గిరిజనుల ప్రయోజనాల కోసం సర్నా ధర్మ కోడ్‌ను ఆమోదించాల్సిందిగా ఆయన ప్రధానిని కోరారు.
గిరిజన సమాజానికి చెందినవారు ప్రాచీన సంప్రదాయాలను అనుసరిస్తూ ప్రకృతిని ఆరాధిస్తారని, చెట్లు, కొండలు, అడవులను పూజిస్తూ వాటిని పరిరక్షిస్తూ, వాటినే మతంగా భావిస్తారని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో దాదాపు 12కోట్ల మంది గిరిజనులు వున్నారు, అందులో జార్ఖండ్‌లో కోటికిపైగా గిరిజనులు వున్నారని అన్నారు.
''జార్ఖండ్‌లో మెజారిటీ జనాభా సర్నా మతాన్ని అనుసరిస్తారు. ఈ పురాతన మతమైన సర్నాకు సజీవంగా వున్న గ్రంథాలంటే అవి నీరు, నేల, అడవి, ప్రకృతినే. ప్రస్తుతమున్న మతాలకు భిన్నంగా సర్నా మత ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆరాధనా పద్ధతులు వుంటాయి. ప్రకృతి ఆధారంగా ఆదివాసీల సంప్రదాయ మత ఆస్తిత్వాన్ని పరిరక్షించాలనే ఆందోళన కచ్చితంగా తీవ్రమైన సమస్యగా వుంది. ప్రకృతిని ఆరాధించే ఈ ఆదివాసీల కమ్యూనిటీ తమ గుర్తింపు గురించి ధీమాగా వుండగలిగేలా సర్నా మత పరమైన కోడ్‌ను గుర్తించాలనే డిమాండ్ తలెత్తింది.'' అని సోరెన్ పేర్కొన్నారు.
కేవలం జార్ఖండ్‌లోనే కాదు, యావత్ దేశంలోని గిరిజన కమ్యూనిటీ కూడా అనేక సంవత్సరాలుగా తమ మత అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాడుతున్నాయని సోరెన్ చెప్పారు. జనాభా లెక్కల్లో సర్నా మతాన్ని అనుసరించే వారినికూడా చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారన్నారు.
కొన్ని సంస్థలు ఏకరూప పౌరు స్మృతి కోసం డిమాండ్ చేస్తున్నపుడు, గిరిజనులు-సర్నా కమ్యూనిటీ డిమాండ్‌పై సానుకూల చొరవ కూడా కచ్చితంగా అవసరమే. ఆదివాసీల జనాభాలో ఇటువంటి అనేక గ్రూపులు అంతరించి పోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని మీకు తెలుసు, అటువంటపుడు సామాజిక న్యాయం సూత్రంపై వారిని రక్షించకపోతే ఇక వారి భాష, సంస్కృతి, అన్నీ కూడా అంతమైపోయే ప్రమాదముందని ఆ లేఖలో సొరేన్ ఆందోళన వ్యక్తం చేశారు.