- ఏజెన్సీలో అమలు కాని పథకాలు
- గిరిజన గ్రామాల్లో కానరాని అభివృద్ధి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారార్భాటాలకే పరిమితం
ప్రజాశక్తి-అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంక్షేమ లబ్ధి అందడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివాసీలకు అన్ని సంక్షేమ పథకాలూ అందిస్తున్నామని ప్రచారార్భాటాలు తప్ప, పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. జగనన్న ఇళ్లు ఇస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఊదరగొడుతున్నారు తప్ప, ఏజెన్సీలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేయలేదని తెలిపారు. అరకులోయలోని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న ఇళ్లకు పట్టాలిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. పివిటిజిలు నివసిస్తోన్న గ్రామాల్లో వరదలు, వానలు, గాలుల వల్ల ఇళ్లు కూలిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. చాలా గ్రామాల్లోని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కూడా లేదన్నారు. రోడ్లు లేక గర్భిణులను డోలీ మోతతో ఆస్పత్రులకు తరలిస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదని తెలిపారు. పివిటిజిలకు గత కేంద్ర బడ్జెట్‌లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, రాష్ట్రపతి సిఫార్సును బట్టి ఖర్చు చేస్తామని చెప్పారని, అయితే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక పైసా కూడా ఖర్చు చేయలేదని అన్నారు. కేటాయించిన నిధులను ఎక్కడకు మళ్లించారని ప్రశ్నించారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని, వీటికి బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి నెలకొందనితెలిపారు. పివిటిజిల్లో అంత్యోదయ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ 35 కిలోల బియ్యం ఇవ్వాలని, సబ్సిడీతో నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. గతంలో పివిటిజిలకు ప్రత్యేక పథకాలు అమలయ్యేవని, 90 శాతం సబ్సిడీతో గొర్రెలు, పశువులు, మేకలు అందించారని, నిరుద్యోగులకు రాయితీ రుణాల సౌకర్యం కల్పించారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ నిలిపేసిందని, ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిందని చెప్పారు. పార్లమెంట్‌లో అటవీ పర్యావరణ సంరక్షణ చట్టం సవరణ బిల్లును ఆమోదించి గిరిజనుల హక్కులను, చట్టాలను కాలరాస్తున్నారన్నారు. ప్రయివేటు కంపెనీలకు అడవులను ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అదానీ వంటి ప్రయివేటు సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిమిత్తం అన్ని అనుమతులూ ఇస్తూ అడవులను కట్టబెడుతున్నారన్నారు. అటవీ పర్యావరణ సవరణ చట్టాన్ని ఏకపక్షంగా ఆమోదించడం సరికాదని తెలిపారు. గిరిజన ప్రాంతంలో పండించే ఆర్గానిక్ కాఫీకి ప్రపంచ గుర్తింపు ఉన్నా దాన్ని పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. కాఫీ ప్రోత్సాహక నిధులను ఐటిడిఎ నేటికీ రైతుల ఖాతాలో జమచేయలేదని తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వరదలు వచ్చి గ్రామాలు నీట మునుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. జీడి పిక్కల ధర దారుణంగా పడిపోయిందని, ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. అక్కడ ఖనిజ సంపదను కొల్లగొట్టడానికే హింసాకాండకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. ఆ రాష్ట్రంలో బిజెపి కుట్రలను వివరించారు. 2002 గుజరాత్ మారణకాండ తర్వాత మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు, అకృత్యాలు జరుగుతుంటే కేంద్రంలోనూ, ఆ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బిజెపి నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.రామారావు పాల్గొన్నారు.