Oct 19,2023 08:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 21, 22 తేదీల్లో వాచాతి విజయోత్సవాలను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని, వాటిని విజయవంతం చేయాలని ప్రజా సంఘాలు కోరాయి. ఈ మేరకు బుధవారం రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, కెవిపిఎస్‌, గిరిజన, కౌలురైతు, డప్పు కళాకారుల సంఘాల నాయకులు ప్రభాకరరెడ్డి, వి వెంకటేశ్వర్లు, రమాదేవి, మాల్యాద్రి, సురేంద్ర, హరిబాబు, క్రాంతికుమార్‌ ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. 1992 జూన్‌ 20న అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారులు వాచాతి గ్రామంలో తనిఖీల పేరుతో ప్రవేశించి స్మగ్లింగ్‌తో ఎలాంటి సంబంధమూ లేని గిరిజన మహిళలపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. ఆహార పదార్థాలు, బావులను ధ్వంసం చేశారని తెలిపారు. 18 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై ఎఐకెఎస్‌, తమిళనాడు ట్రైబల్‌ అసోసియేషన్‌, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం జరిగిందని అన్నారు. 269 మంది దోషులను గుర్తించగా, 54 మంది మరణించారని పేర్కొన్నారు. మిగిలిన 126 మంది అటవీశాఖ సిబ్బంది, 84 మంది పోలీసు, ఐదుగురు రెవెన్యూ అధికారులు దోషులుగా ఉన్నారని అన్నారు. దీనిపై వచ్చిన తీరు దేశ చరిత్రలోనే మైలురాయని వివరించారు. దోషులు చేసుకున్న అప్పీళ్లన్నిటినీ హైకోర్టు తిరస్కరించిందని వివరించారు. వాచాతి గ్రామ ప్రజల పోరాటం స్ఫూర్తిదా యకమని, ప్రజలపై అరాచకాలకు పాల్పడే అధికారులకు హెచ్చరికని వివరించారు. 31 ఏళ్ల చారిత్రక పోరాటం విజయం సాధించిందని తెలిపారు. దీనిపై ఈ నెల 21న విజయోత్సవ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరపాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. అలాగే 22న విజయవాడ రెడ్‌సర్కిల్‌ వద్ద అభి నందన సభ ఉంటుందని, దీనిలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.