- లండన్‌లోని గురుద్వారా వద్ద అడ్డుకున్న రాడికల్ సిక్కులు
న్యూఢిల్లీ : బ్రిటన్‌లో భారత్ హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని శుక్రవారం స్కాట్లండ్‌లోని గురుద్వారాలో ప్రవేశించనీయకుండా రాడికల్ సిక్కు గ్రూపులు అడ్డుకున్నాయి. గ్లాస్గో గురుద్వారాకి చెందిన కమిటీతో దొరైస్వామి సమావేశం ఉన.్నట్లు తమకు తెలిసిందని ఖలిస్తానీ అనుకూల యువకులు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఆయనను లోపలకు రానివ్వకుండా అడ్డుకున్నారని, దీంతో ఆయన వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారని మీడియా కథనాలు తెలిపారు. ఇక నుంచి ఏ గురుద్వారాలోనూ భారత అధికారులెవరినీ స్వాగతించేది లేదన్నారు. హై కమిషనర్‌కు విందు కోసం టేబుల్స్ సిద్ధం చేసి వుంచారు. సిక్కు యూత్ యుకె పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజిలో వుంచిన వీడియోలో కనిపిస్తోంది. హై కమిషనర్‌కు ఆహ్వానాన్ని పంపడంపై గురుద్వారా కమిటీ సభ్యుడొకరు ఘర్షణ పడడంతో సమస్య తలెత్తింది. 'కెనడాలో ఏం జరుగుతోందో మాకు తెలుసు, భారత్ వైఖరిని బహిరంగంగా ఖండిస్తూ, భారత దౌత్యవేత్తలను కెనడా ప్రధాని బహిష్కరించడం మాకు చెంపపెట్టు వంటిది. వీసా దరఖాస్తుల పేరుతో అధికార హోదాలో ఎవరు గురుద్వారాకు వచ్చినా ఇదే జరుగుతుందని' రాడికల్ సిక్కు గ్రూపునకు చెందిన ఒకరు తెలిపారు.
దౌత్యవేత్తలకు భద్రత కల్పించండి
ప్రస్తుతం లండన్ పర్యటనలో వున్న దొరైస్వామికి అదనంగా భద్రత కల్పించాల్సిందిగా బ్రిటన్ అధికారులను భారత్ కోరింది. కెనడాతో ఉన్న వివాదం ప్రభావం బ్రిటన్‌తో సంబంధాలపై చూపుతుందని ఆయన అన్నారు. బ్రిటన్‌లోని ఇతర గురుద్వారాలను హై కమిషనర్ సందర్శించారని, అక్కడ ఎలాంటి సమస్యల తలెత్తలేదని చెప్పారు. తాజా ఘటన ప్రచారం కోసం చేసినట్లు కనిపిస్తోందని, ఘర్షణను నివారించడం కోసం హైకమిషనర్ అక్కడ నుండి వెళ్లిపోయారని తెలిపారు.