- స్తంభించిన పలు రంగాలు, సేవలు
టెల్ అవీవ్ : ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రతిపాదించిన జ్యుడీషియల్ సంస్కరణలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ కార్మిక సంఘాల సమాఖ్య అయిన హిస్తాడ్రట్ సాధారణ సమ్మెకు పిలుపివ్వడంతో సోమవారం టెల్ అవీవ్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక్క విమానం కూడా ఎగరలేదని ఇజ్రాయిల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తెలిపింది. హిస్తాడ్రట్ సమాఖ్యలో ఆరోగ్య, రవాణా, బ్యాంకింగ్, ఇతర రంగాలకు చెందినవారు 7లక్షల మందికిపైగా వున్నారు. ''ఈ క్షణం నుండే ఇజ్రాయిల్ స్తంభిస్తుంది.'' అని హిస్తాడ్రట్ చైర్మన్ అర్నాన్ బార్ డేవిడ్ ప్రకటించారు. ''కార్మికులు, యజమానులు అందరూ కలిసి న్యాయ వ్యవస్థ ప్రక్షాళనను స్తంభింపచేస్తారు.'' అని అన్నారు. సమ్మె పిలుపుతో ఫ్యాక్టరీలు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు మొత్తంగా అన్నీ మూతపడ్డాయి. మరోవైపు ఇజ్రాయిల్ మెడికల్ అసోసియేషన్ కూడా సమ్మెకు పిలుపునిచ్చింది. కేవలం అత్యవసరమైన చికిత్సలకు తప్ప మిగిలిన సేవలన్నీ నిలిచిపోయాయని మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇజ్రాయిల్ యూనివర్శిటీ అధిపతుల సమాఖ్య కూడా సమ్మెలో పాల్గంటున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు మితిమీరిన వైఖరిని అణచివేసేందుకు జ్యుడీషియల్ వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నామని బెంజామిన్ నెతన్యాహు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అవినీతికేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు నెతన్యాహు పన్నిన ఎత్తుగడ అని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.