
ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజులూ దేవీ నవరాత్రులని, పదో రోజు విజయదశమి అని అంటారు. ఈ రెండూ కలిసి దసరా. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆటలకు, పాటలకు ఆలవాలం. దేశమంతటా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో ఈ పండగ జరుగుతుంది. శరదృతువు ఆరంభంలో వచ్చే సందళ్లు కనుక వీటిని శరన్నవరాత్రులనీ అంటారు. తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులూ... అమావాస్య నుంచి నవమి వరకూ బతుకమ్మ ఆడతారు.
దసరా పండగకు గల కారణాలుగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కాలక్రమంలో ఏ పండగకు అయినా కారణాలతో సంబంధం ఉండదు. జనం దృష్టిలో కేవలం సందడీ సరదాలే ఉంటాయి. కథలను, కారణాలను విశ్లేషించే, వివరించే పనిని పండితులు చేస్తూ ఉంటారు. రావణుడిపై రాముడు విజయం సాధించిన రోజు అని ఒక కథ. పాండవులు అజ్ఞాతవాతం ముగించి జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకున్న రోజు అని మరొక కథ. మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన రోజు అని ఇంకొక కథ. విశ్లేషించి చూస్తే ఈ కథల మధ్య సామీప్యత కానీ, సమంజసత్వం కానీ కనిపించవు. పురాణాల ప్రకారం చూసినా- రామాయణ, మహాభారత కథల మధ్య కొన్ని వేల సంవత్సరాల అంతరం ఉంది. మరి అసలు కారణం ఏమై ఉంటుంది అంటే - ఎవరి కథ వారికి ఉంటుంది. నిజానికి సామాన్య జనానికి ఈ కథలతో సంబంధం లేకుండా - ఈ సందర్భాన్ని ఓ సందడిగా, సరదాగా భావిస్తారు. ఉన్నంతలో దసరాను ఆనందంగా గడిపేస్తారు.

మనది భిన్నత్వం గల దేశం. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమూహాల్లో వేర్వేరు సంస్కృతీ సాంప్ర దాయాలు ఉంటాయి. అవి దేశ వైవిధ్యానికీ, భిన్నత్వపు సౌందర్యానికీ చిహ్నాలు. కానీ, రాన్రానూ ఈ సాంస్కృతిక భిన్నత్వం బలహీనపడుతోంది. అదే సమయంలో బలమైన స్వరం గానూ వినిపిస్తోంది. చాలా పండగల విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య అంతరాలు కనిపిస్తాయి. రామాయణంలోని రావణుడు ఉత్తరాదిలో విలనైతే - తమిళనాడులో నాయకుడు. అక్కడ రావణున్ని నిందిస్తే ఇక్కడ పూజిస్తారు. దీని వెనుక సాంస్కృతిక కారణాలే కాదు; సామాజిక, చారిత్రిక కారణాలూ ఉన్నాయి. దీపావళి కథల వెనకా ఇలాంటి కారణాలే ప్రచారంలో ఉన్నాయి. ఆర్యులు దేశాన్ని ఆక్రమిస్తూ, ఆధిపత్యంలోకి వస్తూ... అప్పటికే ఇక్కడ నివాసం ఉన్న వారిపై సంధించిన సాంస్కృతిక ఆధిపత్య ఆయుధాలే ఈ కథలన్నీ అని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, ఇంతలోతుగా ఆలోచించకుండానే అత్యధిక ప్రజానీకం ఈ పండగలను ఆనందంగా జరుపుకుంటారు. దసరా రోజుల్లో ఒకప్పుడు వివిధ వేషాలు వేసుకొని, గ్రామాల్లో సందడి చేసే కళాకారులు ఉండేవారు. పిట్టలదొర వంటి వేషాలు వేసుకుని, ఇంటింటికి తిరిగి దానం స్వీకరించేవారు. దసరా సంబరాల్లో ఇప్పటికీ ఈ వేషాలు కనిపిస్తాయి. సినిమాలూ, టీవీలూ లేని రోజుల్లో ఈ వేషధారులే చూసేవారికి కనువిందు. పిల్లలకు ఆనందం.
వివిధ ప్రాంతాల్లో దసరా
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. మైసూరు దసరా ఉత్సవాలు, కలకత్తా సంబరాలూ దేశంలో చాలా ప్రసిద్ధి. మైసూరులో 400 ఏళ్ల నుంచి దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. అప్పటి మహారాజు ఆధ్వర్యంలో చాముండేశ్వరీ దేవిని ఆరాధించి, ఏనుగులపై ఊరేగించేవారు. అదే ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. మైసూరు వీధుల్లో కోలాహలంగా చేసే కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. రాజభవనాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రదర్శనలో ముందుభాగాన ఏనుగులు పాల్గొనటం ప్రత్యేకత. ఆ ఏనుగుల అలంకరణా నేత్రపర్వమే! ఆయుధపూజ వైభవంగా నిర్వహిస్తారు.
బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా వీధులు ధగద్ధగాయమానంగా వెలుగొందుతాయి. సప్తమి, అష్టమి, నవమి తిధుల్లో దుర్గామాతకు పూజ చేసి, తొమ్మిదో రోజున కాళికామాతను దర్శిస్తారు. లక్షల మంది పాల్గొంటారు. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాత విగ్రహాలను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాల పందిళ్లలో పుస్తకాల ప్రదర్శనలు నిర్వహించే ఆనవాయితీ బెంగాల్లో ఉంది. సామరస్య పూర్వకంగా సందడిని ఆస్వాదించే సాంస్కృతిక వాతావరణం అక్కడ ఉంది. అయితే, ఇటీవలి కాలంలో మత సంబంధ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యానిచ్చే ఒరవడి అక్కడా ప్రారంభమైంది. ఒడిశాలో దసరా సమయంలో దుర్గా దేవిని ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొం దించిన విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి, పూజలు నిర్వ హిస్తారు. దీనిని వారు 'మానబాన' అంటారు. దసరా రోజున బాణసంచా కాలుస్తారు.
గుజరాత్‌లో ...
దసరా సమయంలో ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం. పొలం నుంచి తీసుకువచ్చిన మట్టితో వేదిక తయారుచేసి.. దానిపై బార్లీ, గోధుమ విత్తనా లను చల్లి.. ఆపైన మట్టికుండ పెడతారు. దానిని నీటితో నింపి.. పోకచెక్క, వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టి కుండనే దేవిగా భావిస్తారు. దానినే కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున పూజ నిర్వహించి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటారు. దాండియా పాటలూ, ఆటలతో గొప్ప సందడిని, ఉత్సాహాన్నీ సృష్టిస్తారు.
వీరవాసరంలో ఏనుగు సంబరం
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో సుమారు వందేళ్ల నుంచి దసరా సమయంలో ఏనుగు సంబరాలు జరపడం ఆనవాయితీ. నవరాత్రుల తొలిరోజున ఏనుగు గుడిలో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ సంబరానికి వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసిన ఏనుగును అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితం పూలు, తగరంతో అలంకరణలు చేస్తారు. కొత్తగా చిన్న ఏనుగును తయారుచేసి.. దానినీ అలంకరిస్తారు. చివరిరోజున ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుంచి దాటిస్తారు. సంబరాన్ని సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి, తెల్లవారు ఆరు గంటల వరకూ జరుపుతారు.
విజయనగరంలో సిరిమాను
విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా వెళ్ళిన తరువాత వచ్చే మొదటి మంగళవారం జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో పూజారిని సిరిమాను ఎక్కించి, అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ సిరిమాను సంబరం చూడటానికి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమందీ వస్తారు.
రాళ్ళయుద్ధం.. కర్రల కొట్లాట
కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజు సాయంత్రం ప్రజలు కాలువ ఒడ్డున కంకర రాళ్ళను గుట్టలుగా పోసుకుంటారు. ఒకవైపు రామసేన, మరోవైపు రావణ సేనగా ఏర్పడి, ఒక గుంపుపై మరొక గుంపువారు రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత బాగా ఉత్సవం జరిగినట్టుగా వారు ఉత్సాహపడతారు. ఇదే జిల్లాలోని దేవరగట్టులోనూ బన్ని ఉత్సవం జరుగుతుంది. మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు... పోటీ పడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ గ్రూపు, తమ గ్రామంలోనే ఉండేలా ఇంకో గ్రూపూ వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు.
బందరు శక్తి పటాలు
కృష్ణాజిల్లా బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. వందేళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఓ సైనికుడు కలకత్తా నుంచి తెచ్చి మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేశాడు. అప్పటినుంచి దసరా సమయంలో ఈ ఆలయం నుంచి శక్తి పటాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. పటాన్ని వీపుకు కట్టుకుని, ముఖానికి అమ్మవారి ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధుల్లో తిరుగుతారు. తొమ్మిది రోజులూ ఇలా అన్ని వీధుల్లోనూ ఇంటింటికీ తిరుగుతారు. పటం ధరించినవారు డప్పుల శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తుంటారు. చివరిరోజు కోనేరు సెంటరుకు తీసుకొచ్చి, జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.
ఒంగోలులో కళారాలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో దసరా ఉత్సవాల్లో భాగంగా కళారాల (ముఖాకృతులు) ను ఊరేగిస్తారు. ఈ కళారాలను చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధనికి, నరసింహ స్వామికి కళారాలు ఉన్నాయి. కళారాన్ని బండి మీద ఎక్కించి, అటూ ఇటూ పట్టుకోవడానికి అనువుగా కొయ్యలను అమర్చుతారు. డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు వీరనృత్యం చేస్తూ... కళారాన్ని ఉగ్రంగా ఊపుతూ ఉంటారు. కళారాన్ని ఊరి మధ్యకు తీసుకొచ్చి... అక్కడ రాక్షస సంహార ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
పండగలు ఏవన్నా సందళ్లను ఆవిష్కరిస్తాయి. సంతోషాలను పురిగొల్పుతాయి. దసరా అంతే! ఒక జన సమూహపు సమిష్టి సమ్మేళనానికి, సమైక్య సందళ్లకూ ఇదొక సందర్భం. ఎవరి కథలు వారికి ఉంటాయి. ఆ భిన్నత్వాన్ని గుర్తించాలి. ప్రసార మాధ్యమాలు పెరిగిన క్రమంలో అన్నిచోట్లకూ ఆధిపత్యంలోని ఆటపాటలు ప్రవేశిస్తున్నాయి. ఒకేరకపు సంస్కృతి చొచ్చుకొస్తుంది. సంస్కృతి కూడా గ్లోబలీకరణ, గ్లామరీకరణ, మార్కెట్టీకరణ చెందుతోంది. ఏది పాపులర్‌గా కనిపిస్తే అది .. ఏది ఆకర్షణీయంగా అనిపిస్తే అది .. మూలవిరాట్టులై కూచుంటున్నాయి. పండగలన్నా, వాటిలో ఇమిడి ఉన్న సంస్కృతి అయినా- జనపక్షంగా ఉండాలి. జనానికి చెందినదై ఉండాలి. అప్పుడే పండగలకు సహజత్వపు సొగసు. సందళ్లకు మానవత్వపు మెరుపు!
విజయవాడలో భేతాళనృత్యం
మనకు దసరా అనగానే విజయవాడనే గుర్తొస్తుంది. ఇక్కడ తొమ్మిది రోజులూ వైభవంగా ఉత్సవాలు నిర్వహించి, విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం జరుపుతారు. తర్వాత దుర్గాదేవి విగ్రహాన్ని అలంకరించి, రథంపై పాత నగరంలో ఊరేగిస్తారు. ఊరేగింపు వన్‌టౌన్ పోలీసుస్టేషను వద్దకు రావడంతో ఉత్సవం ముగుస్తుంది. చివరిరోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ సందర్భంగా ప్రదర్శించే భేతాళ నృత్యం విజయవాడ ప్రత్యేకత.

తెలంగాణాలో బతుకమ్మ
తెలంగాణా ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. ఇది ఆ రాష్ట్ర అధికారిక పండగ. ఈ పండగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండగ లేదా సద్దుల పండగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి, తొమ్మిది రోజులు స్త్రీలంతా ఒకచోట చేరి ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఆడపడుచులంతా ప్రతి సాయంత్రం బతకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడతారు. బతకమ్మ చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆరోజు పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగు పూలను, ఇంకా రకరకాల పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఇంటిల్లిపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మని తయారుచేస్తారు. గునగు పూలు, తంగేడు, గుమ్మడి పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పేర్చుతారు. ఆపై తంగేడు పూలతో కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి, చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారుచేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఇలా చాలాసేపు ఆడాక దగ్గర్లో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు 'వాయినమమ్మా వాయినం' అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు.
కరీంనగర్‌లో గని కార్మికులు ఈ పండగను గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా జరుపుకుంటారు. ఆయుధ విన్యాసాలను ప్రదర్శిస్తారు. అక్కడి నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండగ మొదలవుతుంది. ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని, విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతారు. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి, శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

బొమ్మల కొలువులు
దసరా సందర్భంగా బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దేవతామూర్తులు, పక్షులు, జంతువులు, గ్రామీణ వాతావ రణాన్ని ప్రతిబింబించే రకరకాల బొమ్మలను కొలువు తీరుస్తారు. ఈ కొలు వులో తప్పకుండా ఓ ముత్తయిదువ, షావుకారు, ఆవు, దూడ బొమ్మలు పెడతారు. తమిళనాడులోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. మధుర మీనాక్షి ఆలయంలో పెట్టే పెద్ద బొమ్మల కొలువు చాలా ప్రసిద్ధి.
తమిళనాడులోని కులశేఖర పట్టణంలో జరిగే దసరాకు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లేవారు వివిధ వేషా లను ధరిస్తారు. పులి, కోతి, బిక్షగాడు, రాజు, రాక్షసుడు.. ఇలా రకరకాల వేషాలు ధరిస్తారు. 'ప్రతి రూపంలోనూ దేవుడు ఉంటాడు' అని చెప్పటం దీని ఉద్దేశమట! ఈ ఉత్సవాలకు వందేళ్ల చరిత్ర ఉంది. వేడుకలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు.

చేత విల్లంబులు నోట దసరా పద్యాలు
ఓ 30 ఏళ్ల క్రితం వరకూ దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామంలోని ఇంటింటికీ వెళ్ళేవారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని, చేతుల్లో విల్లంబులు పట్టుకుని వచ్చేవారు. ఈ విల్లునే గిలక అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. మచ్చుకు కొన్ని చూడండి :

ప్రారంభంలో పాడే పద్యం :
అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటికిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురువునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తోడ మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య
ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండ బెల్లంబు
కానుకలు అడిగేటప్పుడు :
ఏ దయా మీ దయా మా మీద లేదు
ఇంత సేపుంచుట ఇది మీకు తగదు
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
ఇరుగుపొరుగు వారు ఇస్తారు సుమ్మి
గొప్పగా చూడండి తప్పక మీరు
పావలా బేడయితే పట్టేది లేదు
అర్ధ రూపాయతై అంటేది లేదు
ముప్పావలా అయితే ముట్టేది లేదు
హెచ్చు రూపాయైతే పుచ్చుకుంటాము
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా
కానుకలు ఇచ్చాక .. ఆశీర్వచనాలు :
ధర సింహాసనమై నభంబు గొడుగై
తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై
బ్రహ్మాండ మాకారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై
శ్రీగంగ సత్పుత్రి యై
వరసన్నీ ఘన రాజసంబు నిజమై వర్థిల్లు
నారాయణా
కానుకలు ఇచ్చాక .. పొగడ్తలు :
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా!