
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : విజయనగరం పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం అనగానే భారీ జనసందోహం, సాంస్కృతిక కార్యక్రమాలు, పులివేషాలు, చిత్ర విచిత్ర వేషధారణలు గుర్తుకొస్తాయి. కిక్కిరిసిపోయే ఆలయం మదిలో మెదలుతుంది. లక్షలాదిగా వచ్చే జనాన్ని నియంత్రించడం, భద్రతా చర్యల్లో పోలీసు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. పండగంతా ముగిశాక రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ అధికారులు హమ్మయ్య..! అని దీమా వ్యక్తం చేసేవారు. ఇదంతా గతం మాట. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండడం వల్ల ఈ సారి సిరిమాను సంబంరం అందుకు భిన్నంగా సాగింది. అధికారులు, పోలీసులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. రవాణా సదుపాయం నిలిపివేస్తున్నట్టు ముందస్తుగా చేసిన ప్రకటనల వల్ల ఇతర ప్రాంతాలనుంచి కూడా జనం రాలేదు. నగరంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల ఏర్పాటు, 144 సెక్షన్ అమలుతో ఎలాంటి హడావుడి కనిపించలేదు. సిరిమానోత్సవాన్ని మాత్రం ఎప్పటి మాదిరిగానే అత్యంత సంప్రదాయ బద్ధంగా, వైభవంగా నిర్వహించారు.
కోవిడ్ నేపథ్యంలో సిరిమానోత్సవానికి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. చుట్టాలు, బంధువులు రావద్దంటూ ముందుగానే పిలుపునివ్వడం, ఆర్టీసి బస్సులు నిలిపివేయడం, ప్రయివేటు వాహనాలకు సైతం ప్రత్యేక అనుమతులు తప్పనిసరిచేయడం వంటి చర్యల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం రాలేదు. ఇక పట్టణంలోనూ లాక్‌డౌన్ విధించడంతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. దీనికితోడు పోలీసులు మూడంచెల భద్రతా చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మాత్రమే ఉత్సవ నిర్వహణలో పాల్గొన్నారు. వీరికితోడు సిరిమానును సిద్ధంచేయడం, లాగడం వంటివాటికి వచ్చేజనం యథాతధంగా ఉత్సవానికి హాజరయ్యారు. దీంతో సంప్రదాయాల నడుమ నిరాడంబరం సిరిమానోత్సవం జరిగింది. సాయంత్రం 3.40 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమై 5గంటలకు ముగిసింది. ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు నాలుగోసారి సిరిమానును అవరోధించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆర్‌డిఒ భవానీ శంకర్ ఉత్సవ ప్రారంభ సూచికగా సిరిమాను తాడు లాగారు. అనంతరం పాలధార, ఐరావతం, అంజలి రథం, జాలారివల ఒకదానికి వెంట మరొకటి ముందుకు సాగాయి. అనంతరం సిరిమాను కదిలింది. ఇలా సిరిమాను పైడితల్లమ్మ చదురు గుడి నుంచి కోటకు మూడుసార్లు తిరుగుతూ దర్శనమిచ్చింది. సిరిమానోత్సవాన్ని డిసిసిబి కార్యాలయం నుంచి రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబీకులు, రాష్ట్ర పర్యాటకశాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్‌పి బెల్లాన చందశ్రేఖర్, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుండి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్‌పి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్, వైసిపి జిల్లా సమన్వయకర్త మజ్జిశ్రీనివాసరావు తదితరులు తిలకించారు. కోట బురుజుపై నుంచి మాన్సాస్ చైర్మన్ సంచయిత గజపతి, పూసపాటి ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతి, కుమార్తె ఊర్మిళ గజపతి వీక్షించారు. కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు కుటుంబీకులు ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎస్‌పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు సిరిమానోత్సవాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు. పైడితల్లి ఆలయ ఇఒ జివిఎస్‌ఎస్‌ఆర్ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, సిరిమానోత్సవ ప్రత్యేకాధికారి జి.లక్ష్మణ్, ఇతర అధికారులు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఆర్‌అండ్‌బి, పైడిమాంబ దేవస్థానం, వైద్యారోగ్యశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాన్స్‌కో తదితర సుమారు 22 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సమన్వయంతో సిరిమానోత్సవం విజయవంతానికి కృషి చేశారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా సిరిమానోత్సవం జనాన్ని తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. అమ్మవారిని దర్శించున్న వారిలో రాష్ట్ర మున్సిపల్‌శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, రాజవంశీకులు సుధాగజపతి, ఉర్మిళా గజపతి, పలువురు అధికారులు ఉన్నారు.
కరోనా తగ్గి.. సాధారణ పరిస్థితులు రావాలి : స్పీకర్ తమ్మినేని
కరోనా తగ్గి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని అమ్మవారిని కోరుకున్నట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సీతారాం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిమానుకు సైతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు రావాలని కోరుకున్నట్లు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, అప్పట్లో కేంద్రప్రభుత్వం కూడా సహకరించిందని అన్నారు. ఇప్పుడు కూడా జగన్మోమోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పై దష్టి పెట్టారని అన్నారు. కేంద్రం సహకరించి సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, కేంద్రం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.