Dec 26,2022 15:24

ప్రజాశక్తి-గణపవరం : ధాన్యం కొనుగోలు ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పిప్పరలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసు మాట్లాడుతూ పిప్పర గ్రామానికి చెందిన వట్టిపోలు కొండబాబు వీరవల్లి దానయ్య లు తాము సాగుచేసిన 11 ఎకరాల లో ధాన్యాన్ని గత 20 రోజులుగా కలం లోనే ఉండిపోయిందని అన్నారు. గోని సంచల కోసం తిరుగుతున్న సంచులు అధికారులు ఇవ్వకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంకా మండలంలో గ్రామాల్లో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరో వైపు వరి నాట్లకు సమయం రావడంతో అన్నదాతలు దిక్కులేని స్థితిలో అల్లాడుతున్నారని అన్నారు. ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకపోవడం దారుణమని అన్నారు. తరుగు పేరుతో మద్దతు ధరలో కోత పెట్టడం తగదన్నారు రైతులకు వెంటనే సంచులు ఇవ్వాలని ధాన్యం రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుత్తుల శ్రీనివాసు రైతులు వట్టిపోలు కొండబాబు ముత్యాల హరిప్రసాద్ ఇందుకూరి సుబ్బరాజు వీరవల్లి దానయ్య తదితరులు పాల్గొన్నారు.