- ఒకేసారి సంవత్సరానికి రూ.300
- లబ్ధిదారులు తప్పనిసరి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతులకు సాగులో మెళకువలను, యాజమాన్య పద్ధతులను, సలహాలు, సూచనలను ఉచితంగా అందించడం వ్యవసాయశాఖ ప్రధాన విధి. కాగా సదరు విస్తరణ సేవలను మేగ్జయిన్ రూపంలో కొనుక్కొని చదువుకొని తెలుసుకోవాలంటోంది వ్యవసాయశాఖ. అంతేనా, ప్రభుత్వం నుంచి ఏడాదిలో మూడు కిస్తుల్లో రైతు భరోసా పేరిట అందించే నగదు సహాయం పొందుతున్న లబ్ధిదారులు విధిగా వ్యవసాయశాఖ ప్రతి నెలా ప్రచురించే 'డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా' మాస పత్రికకు రూ.25 వంతున చందా కట్టాలని బలవంతం చేస్తోంది. నెలకోసారి కాకుండా సంవత్సరం మొత్తానికీ ఒకేసారి రూ.300 తప్పనిసరిగా చెల్లించాలని హుకుం జారీ చేసింది.
- రెండేళ్ల నుంచి..
వ్యవసాయశాఖ 'డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా' పేరిట వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ రైతుల సచిత్ర మాస పత్రికను ప్రచురిస్తోంది. అందులో ముఖ్యమంత్రి వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు, అధికారిక సమీక్షలు, పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు నిపుణుల నుంచి సూచనలు, సమీకృత రైతు సమాచార కేంద్రం వివరాలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ వివరాలను ప్రచురిస్తోంది. సంచికకు ప్రధాన సంపాదకులుగా వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ హరి కిరణ్, సంపాదకులుగా ఆర్‌బికెల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. కోవిడ్ సమయంలో కేవలం డిజిటల్ ఎడిషన్‌కే పరిమితం కాగా ప్రస్తుతం ప్రింట్ ఎడిషన్ వస్తోంది. వ్యవసాయశాఖ కార్యాలయాలకు పంపుతున్నారు.
- ఆర్‌బికె యూనిట్
సంచికల అమ్మకానికి వ్యవసాయశాఖ పక్కా ప్రణాళిక రచించింది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె) యూనిట్‌గా టార్గెట్‌లు నిర్ణయించింది. తొలిదశలో ఒక్కో ఆర్‌బికె తరపున కనీసం 15 సంచికలు చేర్పించాలని ఆదేశించింది. ఆర్‌బికె ఇన్‌ఛార్జి రైతుల నుంచి సంవత్సర చందా రూ.300 వసూలు చేసి గుంటూరులోగల పత్రిక హెడ్ ఆఫీస్‌కు పంపాలి. ఒక్కో ఆర్‌బికె పరిధిలో రైతు భరోసా నగదు సహాయం పొందే రైతులు కనీసం వెయ్యి మంది వరకు ఉంటారు, వారిలో 15 మందిని సంచిక చందా దారులుగా చేర్పించాలి. ప్రతి నెలా ఆర్‌బికెలకు సంచికలు పంపుతారు. ఆర్‌బికె ఇన్‌ఛార్జి చందా దారులకు పంపిణీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్, రూరల్ కలుపుకొని 10,778 ఆర్‌బికెలు ఉన్నాయి. తొలి దశలో ఒక్కో ఆర్‌బికె నుంచి 15 మంది రైతులను సంచిక చందాదారులుగా చేర్పిస్తే సర్క్యులేషన్ 1,61,670 అవుతుంది. ఒక్కో సంచిక సంవత్సర చందా రూ.300 కాగా, వ్యవసాయశాఖకు వచ్చే ఆదాయం సుమారు రూ.4.85 కోట్లు. రానున్న రోజుల్లో రైతు భరోసా సహాయం పొందే 50 లక్షల మంది రైతులూ సంచిక చందా దారులు అయితే వ్యవసాయశాఖ ఖాతాకు వచ్చే చందా రూ.150 కోట్లవుతుంది. ఇదేమీ ఊహాజనితం కాదు. వ్యవసాయశాఖ అందుకు సరిపడా పగడ్బందీ ప్లాన్ సిద్ధం చేసిందని తెలుస్తోంది. రైతులకు ఉచితంగా సలహాలివ్వాల్సిన వ్యవసాయశాఖ, సంచిక రూపంలో ఇచ్చి తెలుసుకోవాలనడం, అందులోనూ రైతు భరోసా సహాయాన్ని చూపించి బలవంతంగా చందా కట్టాలని బ్లాక్ మెయిల్ చేయడం అన్యాయమని రైతులు అభ్యంతరం చెపుతున్నారు. సంచికను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సంచికల చేర్పింపు, పంపిణీ తమ వల్ల కాదని సిబ్బంది మొత్తుకుంటున్నారు.










