Sep 02,2023 07:47

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా చూస్తూ కౌలు దారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసాలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో 11.01 కోట్ల రూపాయలను బటన్‌ నొక్కడం ద్వారా శుక్రవారం ఆయన జమ చేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదో ఏడాది మొదట విడతగా కౌలు రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద సిసిఆర్‌సి కార్డులు పొందిన 1,46,324మంది కౌలు రైతులు, దేవాదాయభూముల సాగుదారులుకు తొలి విడతగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా సహాయంగా రూ.109.01కోట్లు, పంట నష్టపోయిన 11,373మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.11.01కోట్లతో కలిపి రూ.120.75 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సంబంధించి కౌలు రైతుల కోసం మంచి చట్టాన్ని తీసుకొచ్చి రైతులెవరికీ ఎటువంటి నష్టం లేకుండా 11 నెలల పాటు సిసిఆర్‌సి కార్డులను గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తమ 50 నెలల పాలనలో దాదాపు 5.28లక్షల మంది కౌలు రైతులకు, 3.99లక్షల ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ అంటే అటవీ భూములు సాగు చేసే గిరిజనులు మొత్తం క పి 9.22లక్షల మందికిమేలు చేస్తూ రూ.1122కోట్లు పెట్టుబడిసాయంగా అందించగలిగామన్నారు. ఇటీవల గోదావరి వరదలకు సంబంధించి రూ.11కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా రూ.38కోట్లు వరద సహాయం కింద సహాయం చేశామని సిఎం వెల్లడించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు , నారుమళ్లు, నాట్లు వేసిన పొలాల రైతులందరినీ వెంటనే ఆదుకుంటూ మరలా పంట వేసుకునేందుకు 80శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్‌బికెల ద్వారా సరఫరా చేసి వారందరికీ అండగా ప్రభుత్వం నిలబడిందని సిఎం తెలిపారు. ఆర్‌బికెల్లో పంటలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత పంటల బీమా 9 గంటల పాటు ఉచిత కరెంటు పగటి పూటే ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు అదనపు ఆదాయం రావాలనే ఉద్ధేశ్యంతో సహకార వ్యవస్థలో మార్పులు చేస్తూ అమూల్‌ను తీసుకొచ్చామని సిఎం పేర్కొన్నారు. గోదావరి నది రిటైనింగ్‌ వాల్‌ పనులు వెంటనే ప్రారంభించాలని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లాను సిఎం ఆదేశించారు. వీలైనంత వేగంగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మరో వైపు కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రతి ఆర్‌బికెను ఒక యూనిట్‌గా తీసుకుని మ్యాపింగ్‌ చేయాలని, ప్రైమరీ ప్రాసెసింగ్‌ని తీసుకొస్తున్నట్లు సిఎం తెలిపారు. మామిడి తప్ప ఇప్పటికే బప్పాయి, అరటితో సహా అన్ని పంటలు ఇన్య్సూరెన్స్‌ పరిధిలోకి తీసుకొచ్చామని సిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ,పశుసంవర్థకశాఖ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, సీదిరి అప్పలరాజు, అధికారులు పాల్గొన్నారు.