- పిఎం కిసాన్ జాడ లేదు
- కౌలు రైతులకు నాలుగైదు నెలల తర్వాతే
- ఖరీఫ్ పెట్టుబడులపై ప్రభుత్వాల తీరు
- అన్నదాతల ఎదురుచూపులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : రైతన్నలకు ఖరీఫ్ పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వం వేశామంటున్న 'రైతు భరోసా' తొమ్మిది రోజులవుతున్నా 'అండర్ ప్రాసెస్' అని కంప్యూటర్లలో చూపిస్తోంది. లక్షల మంది రైతులకు భరోసా సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. ఇదిలా ఉండగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.2,000 మొత్తానికే పడలేదు. భూమిలేని కౌలు రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరోసా ఇస్తామనగా, ఈ ఏడాది కూడా ఖరీఫ్ ముందు భూమి యజమానులతోపాటు ఇవ్వలేదు. రెండు కిస్తులూ కలిపి ఎప్పుడో ఖరీఫ్ చివరిలో, లేదంటే రబీ మొదట్లో ఇస్తామంటోంది. ఖరీఫ్‌లోనే కౌలు వ్యవసాయం ఎక్కువ. వారికి బ్యాంకు రుణాలు అందట్లేదు. కనీసం ప్రభుత్వం ఇచ్చే సాయమైనా దొరుకుతుందని ఆశించిన కౌల్దార్లకు గత నాలుగేళ్లకుమల్లే ఈ మారు సైతం ఎప్పుడో ఇస్తామని వారి ఆశలపై నీళ్లు చల్లింది.
- లక్షల మంది నిరీక్షణ
స్వంత భూమి కలిగిన రైతులకు వరసగా ఐదో ఏడాది తొలి వాయిదా కింద రూ.7,500 వంతున 52,30,939 మంది ఖాతాల్లో భరోసా జమ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు జూన్ 1న ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పత్తికొండలో బటన్ నొక్కారు. కేంద్ర పథకం పిఎం కిసాన్‌తో కలిపి రైతు భరోసా అమలు చేస్తున్నందున వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.5,500. ఆ మొత్తం సైతం పేర్కొన్న రైతులందరి ఖాతాల్లో జమ కాలేదని రైతుల నుంచి ఫిర్యాదులందుతున్నాయి. సిఎం బటన్ నొక్కిన దగ్గర నుంచి తమ అకౌంట్లలో భరోసా సొమ్ము పడిందా లేదా అని రైతులు ఎక్కే గడప దిగే గడపలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు కొంత మందికే పడుతున్నాయి. బటన్ నొక్కి తొమ్మిది రోజులయ్యాక కూడా లక్షల మంది రైతుల ఖాతాల్లో భరోసా జమ కాలేదని సమాచారం. సిఎఫ్‌ఎంఎస్ నిబంధనల కారణంగా నిధుల లభ్యత ఆధారంగా రోజుకు కొంత మంది చొప్పున దశల వారీగా సొమ్ము పడుతోందని అధికారవర్గాలు వెల్లడించాయి. సాంకేతిక కారణాల వలన కూడా రైతులకు భరోసా పడట్లేదని చెబుతున్నారు.
- సెంటర్ జాడ లేదు
కేంద్రం నుంచి రూ.2 వేలు పడతాయనగా ఇప్పటి వరకు వాటి జాడ లేదు. ఎప్పుడు పడతాయో చెప్పలేకపోతున్నారు. సంక్రాంతి కిస్తు సైతం కేంద్రం నుంచి ఆలస్యంగా వచ్చింది. అదీ కొంత మందికే వచ్చింది. లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతోంది. కానీ ఆ నిధులతో కలిపి రైతులకు రూ.7,500 ఇచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. కేంద్ర సాయం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఒకేసారి ఖరీఫ్ పెట్టుబడి కింద రైతుల చేతుల్లో రూ.12,500 పెడతామనగా, కేంద్రంతో కలిపి పథకం అమలు చేస్తుండటంతో ఒకేసారి కాకుండా ఏడాదికి మూడు విడతల్లో భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానిది ఒకసారి, కేంద్రానిది మరోసారి రెండు విడతల్లో ఒక కిస్తు పడుతోంది. పెరిగిన సాగు ఖర్చుల నేపథ్యంలో దశలవారీగా కొద్దికొద్దిగా అందే భరోసా పెట్టుబడులకు ఏ మూలకూ చాలట్లేదని అన్నదాతలు వాపోతున్నారు.
- వారికే అవసరం
వాస్తవానికి భూమిపై కష్టపడేది కౌలు రైతులే. వారికే పెట్టుబడులు అవసరమవుతాయి. కేంద్రం వారిని మొత్తానికే పరిగణనలోకి తీసుకోలేదు. ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం స్వంత భూమి కలిగిన వారికి ముందు భరోసా ఇచ్చి తర్వాత ఎప్పుడో నామమాత్రపు సంఖ్యలో భూమి లేని ఎస్‌ఎసి, ఎస్‌టి, బిసి, మైనార్టీ రైతులకు ఇస్తోంది. అటువంటి వారు పది లక్షల వరకు ఉండగా, నాలుగేళ్లల్లో ఇచ్చింది గరిష్టంగా లక్ష మంది లోపే. సిసిఆర్‌సి కార్డుల జారీ పూర్తి కానందున కౌలు రైతులకు నాలుగైదు నెలల తర్వాత భరోసా ప్రభుత్వం అంటోంది.










