Jun 01,2023 12:19

కర్నూల్ : వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్‌ జమ చేశారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం రైతు భరోసా నిధులు మాత్రమే జమ చేస్తున్నామని, పిఎం కిసాన్ నిధులు ఆలస్యం అవుతాయని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత నాలుగేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. దానిలో భాగంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 10,778 రైతు భరోసా కేంద్రాలతో నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ... సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్.బి.కెలతో పూర్తిగా వ్యవసాయాన్ని మార్పు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సగం మండలాల్లో కరువు మండలాలు ఉండేవని తెలిపారు. ప్రస్తుతం ఒక కరువు మండలం కూడా లేదని, వలసలు కూడా తగ్గాయని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి అమూల్ డైరీని తీసుకొచ్చామని తెలిపారు. మహానాడుతో డ్రామా చేస్తున్నారని జగన్ విమర్శించారు. టిడిపి మానిఫెస్టోపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు మానిఫెస్టోతో హామీలు ఇచ్చి, ఎన్నికల్ తరువాత వెన్నుపోటు పొడుస్తారని ఎద్దేవా చేశారు.