Aug 05,2023 20:03

ప్రజాశక్తి - పలాస : రైతుభరోసా కేంద్రాల ద్వారా జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జీడి రైతు సంఘం ఆధ్వర్యాన శనివారం లక్ష సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ప్రముఖ ప్రజా వైద్యులు తెప్పల ఆనంద్‌ తొలి సంతకం చేసి ప్రారంభించారు. పెద్దసంఖ్యలో జీడి రైతులు, ప్రజలు పాల్గొని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీడి రైతులు చేస్తున్న ధర్మ పోరాటానికి మద్దతుగా అందరూ సంతకాలు చేయాలని కోరారు. జీడి రైతులకు మద్దతు ధర ఇవ్వడం ద్వారా జీడి పరిశ్రమలు అభివృద్ధి చెంది వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతారని తెలిపారు. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ మాట్లాడారు. జీడి రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమన్నారు. జీడికి మద్దతు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో 80 కేజీల జీడి పిక్కల బస్తా రూ.14 వేలు ఉంటే, నేడు రూ.ఏడు వేలకు పడిపోయిందని దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. జీడిపప్పు ధర ఆకాశాన్ని అంటుతుంటే జీడి పిక్కల ధర పాతాళానికి పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా జీడి రైతులు పలురూపాల్లో పోరాడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రూ.16 వేలు మద్దతు ధర ఇవ్వాలని, కేరళ తరహాలో జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి పంటకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు అంబటి రామకృష్ణ, కె.సింహాచలం, తెప్పల రాజు తదితరులు పాల్గొన్నారు.