Jul 30,2023 11:42

మాస్కో : రష్యా రాజధాని నగరం మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌లు దాడి చేశాయని మాస్కో నగర మేయర్‌ సెర్గి సోబియానిన్‌ ఆదివారం ఉదయం తెలిపారు. నగరంలోని ఆఫీస్‌ టవర్లు రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయని, ఎవరూ గాయపడలేదని లేదా మరణించలేదని సోబియానిన్‌ తన టెలిగ్రామ్‌ చానెల్‌లో తెలిపారు. ఈ దాడిలో మొత్తంగా మూడు డ్రోన్‌లు పాల్గన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాస్కో వెలుపలే గాల్లోనే ఒక డ్రోన్‌ ధ్వంసమైందని, మిగిలిన రెండింటినీ వైమానిక రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయని ఆ ప్రకటన పేర్కొంది. దాంతో ఆ రెండు డ్రోన్‌లు నగరంలోని నివాసయేతర కాంప్లెక్స్‌ ప్రాంతంలో పడిపోయాయని తెలిపింది. 50 అంతస్తుల ఐక్యూ కార్టర్‌ కాంప్లెక్స్‌లో ఐదు, ఆరవ అంతస్తుల మధ్య పెద్ద పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది. ఏడు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వసంస్థలకు చెందిన కార్యాలయాలు ఆ కాంప్లెక్స్‌లో వున్నాయి. ఒకో- 2 భవనంలో రెండో పేలుడు సంభవించిందని, అక్కడ సెక్యూరిటీ గార్డు ఒకరు గాయపడ్డారని తెలిపింది. దెబ్బతిన్న భవనాలను వెంటనే ఖాళీచేయించారు.