Nov 08,2023 11:19

పరవాడ (అనకాపల్లి) : ఫోన్‌లో దిశ యాప్‌ ఎక్కించే విషయంలో జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించిన ఘటన అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సంతబయలు వద్ద జరిగింది.

బాధితుడు, స్థానిక వివరాల మేరకు ... అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్‌ అలీముల్లా జమ్మూ కాశ్మీర్‌ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ ర్కైఫిల్‌ క్యాంపులో సైనికుడుగా ఉన్నారు. సెలవుపై ఈ నెల 2న ఇంటికి వచ్చారు. గత మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సు కోసం అలీముల్లా ఎదురుచూస్తున్నారు. అప్పటికే అక్కడున్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ఎం.ముత్యాలనాయుడు, శోభారాణి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. సయ్యద్‌ అలీముల్లా ఫోన్‌లోనూ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. ఈ క్రమంలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్‌ రాసుకున్నారు. ఓటీపీతో సైబర్‌ మోసాలు జరిగే అవకాశం ఉందని, మీ బ్యాడ్జిలపై పేర్లు లేవనీ, తనకు అనుమానం కలుగుతోందని, గుర్తింపు కార్డుల్ని చూపించాలని అలీముల్లా పోలీసులను కోరారు. వేసుకున్న పోలీస్‌ డ్రెస్‌ కనిపించడం లేదా ? స్టేషన్‌కొస్తే గుర్తింపు కార్డుల్ని చూపిస్తాం అని కానిస్టేబుళ్లు పరుషంగా మాట్లాడుతూ... అలీముల్లా చొక్కా కాలర్‌ పట్టుకుని లాగేయడంతో సైనికుడు కింద పడిపోయారు. తర్వాత ఓ కానిస్టేబుల్‌ బూటుకాలితో అలీముల్లాను తన్నాడు. మహిళా కానిస్టేబుల్‌ వచ్చి అలీముల్లా దవడపై కొట్టింది. గుర్తింపుకార్డు అడిగినంత మాత్రాన ఇంతలా దాడి చేస్తారా ? అని పోలీసులను స్థానికులు ప్రశ్నించారు. పురుషులకు దిశ యాప్‌ ఎందుకని నిలదీశారు. అంతలో మరో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నలుగురూ కలసి అలీముల్లాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడానికి బలవంతంగా ఆటో ఎక్కించబోయారు. బాధితుడు ప్రతిఘటించారు. చివరికి పోలీసులు అతని ఐడీకార్డును తీసుకెళ్లిపోయారు. దీంతో అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణను కలసి జరిగిన ఘటనను బాధితుడు వివరించారు. ఈ ఉదంతంపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు కానిస్టేబుల్స్‌ను వీఆర్‌కు ఎటాచ్‌ చేశారు.