Nov 04,2023 10:33
  • ఇజ్రాయిల్‌ దాష్టీకంపై అరబ్‌ ప్రపంచం ఆగ్రహం
  • క్షతగాత్రుల కోసం తాత్కాలికంగా రఫా సరిహద్దును తెరిచిన ఈజిప్టు
  • ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు కట్‌: బొలీవియా
  • టెల్‌ అవీవ్‌ నుంచి తమ రాయబారిని వెనక్కి రప్పించిన జోర్డాన్‌

గాజా స్ట్రిప్‌ : ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై యూదు దురహంకార ఇజ్రాయిల్‌ వరుసగా రెండవ సారి వైమానిక దాడి జరిపి అనేక మందిని పొట్టనపెట్టుకుంది. మంగళవారం జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలో తలదాచుకున్న పాలస్తీనీయుల్లో 50 మంది చనిపోయారు. మరో 150 మంది గాయపడ్డారు. దీంతో గత 24 రోజుల్లో ఇజ్రాయిల్‌ దాడుల్లో మరణించిన పాలస్తీనీయుల సంఖ్య 8,538 కి చేరుకుంది. వీరిలో 3,542 మంది పిల్లలే. అయినా యుద్ధోన్మాది నెతన్యాహు రక్తదాహం తీరలేదు. బుధవారం కూడా మళ్లీ అదే శిబిరంపై వైమానికి దాడులు కొనసాగించాడు. గాజా సిటీ దిశగా భూతల దాడులను ఇజ్రాయిల్‌ సైన్యం విస్తరించింది. జబాలియా శరణార్థి శిబిరంపై అమానుష దాడిపై అరబ్‌ ప్రపంచం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని ఖండించాయి. ప్రపంచ నేతలకు ఇప్పటికైనా కనువిప్పుకావాలని హెచ్చరించాయి. గాజాపై ఇజ్రాయిల్‌ నిరంతరాయంగా సాగిస్తున్న హంతక దాడులను ఆపేందుకు తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా నెతన్యాహు మెడలు వంచాలని కోరాయి. ఇజ్రాయిల్‌ అనాగరిక దాడికి నిరసనగా జోర్డాన్‌ టెల్‌అవీవ్‌ నుంచి తన రాయబారిని వెనక్కి రప్పించింది. బొలీవియా ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లనే జబాలియా శరణార్థి శిబిరంగా మార్చారు. ఉత్తర గాజా నుండి బలవంతంగా తరిమివేయబడిన కుటుంబాలు ఇక్కడ తలదాచుకుంటున్నాయి. ఈ శిబిరాన్ని కూడా నాశనం చేయడం ఇజ్రాయిల్‌ రాక్షసత్వానికి పరాకాష్ట. ఈ దాడిలో గాయపడిన వారి కోసం రఫా సరిహద్దును ఈజిప్టు తొలిసారి తాత్కాలికంగా తెరచి ఉంచింది. గాజాకు ఇంధనం అందకుండా ఇజ్రాయిల్‌ అడ్డుకోవడం వల్ల గాజాలోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లోని మెయిన్‌ జనరేటర్లు పూర్తిగా షట్‌డౌన్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది.