Nov 19,2023 09:03
  • పొంచివున్న ఆకలిచావులు : ఐరాస

గాజా సిటీ : గతకొద్ది రోజులుగా అల్‌షిఫా అస్పత్రిని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరిపిన ఇజ్రాయిల్‌ బలగాలు తాజాగా జాబాలియా శరణార్ధ శిబిరంలో గల స్కూలుపై దాడిచేశాయి. శనివారం ఉదయం అల్‌-ఫకూరా పాఠశాలపై జరిగిన దాడిలో 50మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 19మంది చిన్నారులతో సహా ఒకే కుటుంబానికిచెందిన 32మంది ఉన్నారు. స్కూలుపై బాంబు దాడిని హమస్‌ తీవ్రంగా ఖండించింది. అభం శుభం తెలియని చిన్నారులను, అమాయకులను బలితీసుకుంటున్న ఇజ్రాయిల్‌ను ఈ దాడులకు, నేరాలకు జవాబుదారీ చేస్తామని పేర్కొంది. మొత్తంగా ఉత్తర గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లు ఎవరూ లేకుండా చేయాలన్నది ఇజ్రాయిల్‌ ఆలోచనగా వుందని, అందుకే ఇలా స్కూలుపై దాడి చేసిందని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి నిర్వహించే పాఠశాలపై ఈ దాడి జరిగిందని తెలిపింది. ఈ పాఠశాలలో వేలాదిమంది నిర్వాసితులు తలదాచుకున్నారు. రఫాలోని భవనాలు కూడా బాంబులు వేసి ధ్వంసం చేశారు. నుసైరాత్‌ శరణార్థుల శిబిరంపై కూడా దాడి జరిగింది. వెస్ట్‌ బ్యాంక్‌లోని జెనిన్‌ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు. దక్షిణ గాజాలోని అల్‌-ఫాలా పాఠశాలపై ఇజ్రాయెల్‌ బాంబు దాడి చేయడంతో పలువురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 42 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్‌ దాడుల్లో మృతుల సంఖ్య 12వేలు దాటింది.
 

                                          పెద్దాసుపత్రిపై ఇజ్రాయెల్‌ దాడి : 'ఐసీయూలో ఉన్నవారంతా చనిపోయారు'

గాజా నగరంలోని అతి పెద్దదయిన అల్‌ షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ దళాలు శుక్రవారం రాత్రి జరిపిన క్రూరమైన దాడిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న వారంతా చనిపోయారని ఆసుపత్రి డైరెక్టర్‌ ముహమ్మద్‌ అబు సల్మియా తెలిపారు. ఒక్క రాత్రిలో ఆస్పత్రిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి పెద్ద కాన్సంట్రేషన్‌ క్యాంపుగా, సామూహిక సమాధిగా మారిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తాను, సిబ్బంది, రోగులతో సహా కొద్దిమంది మాత్రమే వున్నామని, అక్కడ నుండి వెళ్లడానికి ఇజ్రాయిల్‌ బలగాలు అనుమతించడం లేదని తెలిపారు. శుక్రవారం మూడో రోజు కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ఆసుపత్రిలోనే మకాం వేసింది. ఇంధనం, మందులు, ఆహారం లేదా నీరు లేవు. రోగులు, ఆరోగ్య అధికారులు , శరణార్థులు సహా 7,000 మందికి పైగా చిక్కుకున్నారు. ప్రతి నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకుని, అల్‌ షిఫా అస్పత్రిలో ఇంక్యుబేటర్లలో వున్న శిశువులను, గాయపడిన చిన్నారులను వెస్ట్‌ బ్యాంక్‌ లేదా ఈజిప్ట్‌లోని ఆస్పత్రులకు తరలించి, వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పాలస్తీనా ఆరోగ్యమంత్రి మయి అల్‌-కైలా కోరారు. అల్‌ షిఫా ఆస్పత్రిని మిలటరీ బ్యారక్స్‌గా మార్చేస్తున్నారని, తుపాకీలు చూపి బెదిరిస్తూ లోపల వున్నవారిని ఖాళీ చేయిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గాజాలో ఏ ఆస్పత్రిలో కూడా గాయపడినవారికి చికిత్సనందించే సదుపాయాలు లేవన్నారు.
         గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో రోజుకు రెండు ట్రక్కులకు ఇంధనాన్ని అనుమతిస్తామని ప్రకటించారు. హమాస్‌కు అందుబాటులో లేకుండా చూసుకోవాలని మంత్రివర్గం కోరింది. అక్టోబరు 7న యుద్ధం మొదలైన తర్వాత గాజా స్ట్రిప్‌లోకి ఇంధనం చేరడం ఇదే తొలిసారి. నీటి సరఫరా మరియు వ్యర్థ పైపులైన్‌లను నిర్వహించడానికి అవసరమైన ఇంధనం మాత్రమే రఫా సరిహద్దు ద్వారా గాజా స్ట్రిప్‌లోకి రవాణా చేయబడుతుందని ఇజ్రాయెల్‌ ప్రకటన. గాజాలో కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా పూర్తిగా మూతపడింది. గాజాలో ఫీల్డ్‌ హాస్పిటల్‌ ప్రారంభించడానికి ఐక్యరాజ్యసమితి సుముఖత వ్యక్తం చేసింది.
          ఇదిలావుండగా అల్‌-షిఫా హాస్పిటల్‌ నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలుగా చిత్రీకరిస్తూ ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసిన వీడియో నకిలీదని తేలడంతో, మరుసటి రోజు దానిని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌లోని బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం అల్‌-షిఫా హమాస్‌ కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని చేస్తున్న ప్రచారం ఎంత బూటకమో దీంతో స్పష్టమయింది. కాల్పుల విరమణ జరిగితే గాజాలో ఆస్పత్రులను తాము పునర్నిర్మిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించారు. గాజాలో సురక్షితమైన ప్రదేశం అంటూ ఏమీ లేకుండా పోయిందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తమారా అల్‌ రిఫారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక గంట సమయమిచ్చి అల్‌షిఫా ఆస్పత్రి నుండి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించారని, అలా వెళ్ళేవారినిముఖ్యంగా మహిళలను అమానవీయమైన రీతిలో సోదాచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బట్టలూడదీయించి మరీ వారు సోదాలు చేస్తున్నారని, తలెత్తుకోలేని రీతిలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు చెప్పారు. ఆస్పత్రి పై అంతస్తులో అనేకమందిని బందీలుగా వుంచి వారికి ఆహారం, నీరు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
 

                                                గాజాలో పొంచివున్న ఆకలిచావులు : ఐరాస హెచ్చరిక

ఇంధన కొరత కారణంగా ఏర్పడిన దయనీయమైన, నిస్సహాయ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందుల పాలవుతున్న గాజా ప్రజలు ఆకలిచావులను ఎదుర్కొనే అవకాశాలు కూడా పొంచి వున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. శీతాకాలం సమీపిస్తున్నందున పరిస్థితులు మరింత అధ్వానంగా మారతాయని పేర్కొంది. గత ఐదు వారాల కాలంలో గాజాకు కేవలం 10శాతం ఆహారం మాత్రమే వచ్చిందని ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) మధ్య ప్రాచ్య ప్రాంతీయ ప్రతినిధి అబీర్‌ ఇటెఫా చెప్పారు. దీంతో ప్రజల్లో డీ హైడ్రేషన్‌, పోషకాహార లోపం బాగా పెరుగుతోందన్నారు. దాదాపు గాజాలో వున్న ప్రతి వ్యక్తీ ఆహార అవసరాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాడని తెలిపారు.