మాస్కో : దేశీయ మార్కెట్‌కు మద్దతు కోసం ఈ ఏడాది చివరి వరకు బియ్యం ఎగుమతులను రష్యా నిలిపివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ముడి బియ్యం, ప్రాసెస్ చేసిన బియ్యం రెండింటి ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకుఈ ఆంక్షలు అమల్లో వుంటాయి. దేశీయ మార్కెట్‌ను సుస్థిరంగా కొనసాగించేందుకే ఈ నిర్ణయమని పేర్కొన్నారు. అయితే యురేసియన్ ఆర్థిక యూనియన్‌లో ఇతర సభ్య దేశాలైన ఆర్మేనియా, బెలారస్, కజకస్తాన్, కిర్గిస్తాన్‌లకు ఈ నిషేధం వర్తించదు. పైగా, మానవతా సాయం కోసం విదేశాలకు వెళ్లే బియ్యం ఎగుమతులు కూడా కొనసాగుతాయి. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో అతిపెద్దదైన భారత్ ఈ వారం ప్రారంభంలో ఇదే రకమైన చర్య తీసుకుంది. బాస్మతీయేతర బియ్యాన్ని విదేశాలకు అమ్మడంపై నిషేధం విధించింది. దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరగకుండా, తగినంతగా అందుబాటులో వుండేందుకే ఈ చర్య అని పేర్కొంది.










