న్యూఢిల్లీ : కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) విధించిన రూ.1,337.67 కోట్ల జరిమానాను గూగుల్ చెల్లించాల్సిందేనని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ బుధవారం స్పష్టం చేసింది. గూగుల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఎన్‌సిఎల్‌ఎటికి చెందిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. సిసిఐ చేపట్టిన విచారణలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని పేర్కొంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ డివైస్ ల విషయంలో సిసిఐ గతేడాది అక్టోబర్ 20న గూగుల్‌కి రూ.1,337.67 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అక్రమ పద్ధతిలో సాగే వ్యాపారాలను నిలిపివేయాలని హెచ్చరించింది. సిసిఐ తీర్పుని సవాలు చేస్తూ గూగుల్ ఎన్‌సిఎల్‌ఎటిని ఆశ్రయించింది.










