ప్రజాశక్తి- విజయవాడ : గొప్ప దార్శనికుడు, అభ్యుదయ భావాలకు వేగుచుక్క, మహిళా పక్షపాతి అయిన మహాకవి గురజాడ అప్పారావు పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వాలనుకోవడం గురజాడ స్ఫూర్తిని అవమానించడమే అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. చాగంటికి అవార్డు ఇచ్చే నిర్ణయాన్ని గురజాడ సాంస్కృతిక సమాఖ్య పునరాలోచించాలని డిమాండ్ చేశారు. మహాకవి గురజాడ అప్పారావు పేరిట అవార్డును చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జాషువా సాంస్కృతిక వేదిక అధ్యక్షులు ఎ.సునీల్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఈ నెల 30న గురజాడ వర్థంతిని పురస్కరించుకొని రచయితలు, కవులు, కళాకారులు, అభ్యదయవాదులు, ఆయా ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో 18 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ వాణి వినిపించారు. గురజాడ రచనలను తిరస్కరించి, ఆయనను బహిష్కరించిన ఆధిపత్యవాదులే నేడు తమ మతభావ జాలకుడిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముందు తరాలను మున్ముందుకు నడిపే దూరదృష్టిలో గురజాడ రచనలు చేశారని, సమాజాన్ని వెనక్కు నడిపించే భావజాలకులకు ఆయన పేరిట పురస్కారం ఇవ్వడం తగదన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యాజీ మాట్లాడుతూ ఆనాడు సమాజంలో వేళ్లూనుకున్న అజ్ఞానాన్ని పారదోలడానికి గురజాడ గొప్ప రచనలు చేశారని తెలిపారు. కన్యాశుల్కం, సౌధామిని వంటి రచనల్లో మహిళల అభ్యున్నతిని కోరారని, వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రదర్శించారని ఉదహరించారు. ఉత్పత్తి శక్తులను గౌరవించారని, కులమతాలకు అతీతమైన విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించారని తెలిపారు. అలాంటి ముందుచూపుగల మహాకవి అవార్డును ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం అసమంజసం, అన్యాయమని అన్నారు. సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గురజాడ అవార్డును చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. అరసం జిల్లా కార్యదర్శి అజరు కుమార్, ప్రోగ్రెసివ్ ఫోరమ్ - సంగమం నాయకులు తాజారావు, స్వరలయ వేదిక నిర్వహకులు కొప్పుల అశోక్, హేతువాద సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్‌కుమార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్, ప్రజాశక్తి బుకహేౌస్ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, షార్ట్ ఫిలిమ్ అసోసియేషన్ నిర్వాహుకులు డివి రాజు, జెవివి నాయకులు శ్రీనివాసరావు, ఎంబివికె బాధ్యులు క్రాంతికుమార్, డివైఎఫ్‌ఐ పూర్వ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు, బిఎస్‌ఎన్‌ఎల్ నాయకులు చంద్రశేఖర్ ప్రసంగించారు. జాషువా సాంస్కృతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.