Sep 21,2023 21:30

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌ (విజయవాడ అర్బన్‌) :సామాజిక రుగ్మతలను రూపుమాపే సాంఘిక పరివర్తనకు అహర్నిశలు కృషి చేసిన మహాకవి గురజాడ అప్పారావును నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు అన్నారు. గురజాడ 161వ జయంతిని పురస్కరించుకుని గురువారం జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, జిఆర్‌కె పోలవరపు కళాసమితి, సేవ్‌ సంస్థ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో 2కె రన్‌ నిర్వహించారు. ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం వద్ద కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920వ శతాబ్థంలో గురజాడ రచించిన రచనలు నేటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు. ఆనాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలపై గొప్ప రచనలు చేశారన్నారు. దేశమును ప్రేమించుమన్న గేయాన్ని ర్యాలీలో పాల్గన్న విద్యార్థులందరితో కలిసి ఆలపించారు. సుమారు వేయి మంది విద్యార్థులతో నిర్వహించిన 2కె రన్‌ ర్యాలీ నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం వద్ద నుండి రెడ్‌ సర్కిల్‌, కస్తూరిబాయిపేట గాంధీ బమ్మలు, మధు గార్డెన్స్‌, శిఖామణి సెంటర్‌ మీదుగా తిరిగి ఫుడ్‌కోర్టు వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు ఎంసి దాస్‌, మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, ప్రముఖ విద్యావేత్త ఎస్‌ఆర్‌ పరిమి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షులు జి రశ్మి, అమరావతి బాలోత్సవ్‌ గౌరవాధ్యక్షులు చలవాది మల్లిఖార్జునరావు, ఎంబివికె కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరలు పాల్గొన్నారు.