Dec 01,2022 09:05

ప్రజాశక్తి- యంత్రాంగం : మనుషులను ప్రేమించాలని, మంచితనాన్ని పెంపొందించాలని, దేశమంటే మట్టికాదోరు, మనుషులని చెప్పిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. సాహితీ స్రవంతి, ఐద్వా ఆధ్వర్యంలో గురజాడ 107వ వర్థంతిని బుధవారం పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు.
కర్నూలులోని లలితకళా సమితిలో గురజాడ వర్థంతి సభలో సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ అగ్నిహోత్రావధానులకు గురజాడ పురస్కారం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు విజయనగరంలో జరుగుతున్నది కూడా అచ్చం అలాగే ఉందని విమర్శించారు. ఆ వివాదం ఆస్తిక, నాస్తిక సమస్య కాదని, భావాలకు సంబంధించిన సమస్యగానే చూస్తున్నామన్నారు. గురజాడ వచనం చాగంటి ప్రవచనం వేర్వేర్వేరని తెలిపారు. చాగంటికి ప్రవచన సామ్రాట్‌, ఆధ్యాత్మిక రత్న, శ్లోక సర్వస్వ వంటి బిరుదులు ఎన్నయినా ఇవ్వండి కానీ గురజాడ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గురజాడ దేశాభివృద్ధిని కోరుకుంటే పాలకులు దేశాన్ని అమ్మడానికి పూనుకున్నారని చెప్పారు.
మనుషుల మధ్య ద్వేషాన్ని, అపనమ్మకాన్ని పెంచుతున్న ఈ రోజుల్లో, వట్టి మాటల్లో బతుకుతున్న ఈ దేశానికి గట్టిమేలు కావాలంటే సమాజానికి గురజాడ మాటలు అవసరమని తెలిపారు. సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్లేవాళ్లు, మహిళలను గౌరవించని వాళ్లు, మతాల మధ్య మంటలు పెట్టేవాళ్ళు ఎప్పుడు అభ్యుదయవాదులు కాలేరన్నారు. లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ బి శంకర శర్మ ప్రసంగించారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, ఐద్వా, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం, ప్రజానాట్యమండలి, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.
'దేశమును ప్రేమించుమన్నా' దేశభక్తి గేయాన్ని విశాఖ ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద ఉన్న గురజాడ విగ్రహ కూడలిలో పలువురు సాహితీ వేత్తలు ఆలపించారు. ముందుగా గురజాడ చిత్రపటానికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవం లేని రాళ్లు, రప్పలకు దండాలు పెట్టి పూజించడం కాకుండా మనుషులను ప్రేమించాలని, మంచితనాన్ని పెంపొందించాలన్నారని తెలిపారు. దేశమంటే మట్టి కాదని మనుషులని, భార్యను బానిసగా చూసే పరిస్థితి పోయి ప్రాణ స్నేహితురాలుగా చూసే పరిస్థితి రావాలని, ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుందని గురజాడ పేర్కొన్నారని వివరించారు. నేడు భారతదేశాన్ని మధ్య యుగాలనాటి స్థితికి తీసుకెళ్లాలని పాలకవర్గాలు చేస్తోన్న ప్రయత్నాలకు ఊతమిచ్చేటట్టుగా ఈ సంవత్సరం గురజాడ పురస్కారాన్ని చాందసవాది చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల అప్పలరాజు (అరసం), రామకృష్ణ (విశాఖ రచయితల సంఘం), పి.రామారావు (సాహితీ స్రవంతి), జి.రాజేశ్వరరావు (అల్లూరి విజ్ఞాన కేంద్రం), ఐద్వా నాయకులు బి.పద్మ, వై.సత్యవతి, కె.నిర్మల తదితరులు పాల్గొన్నారు.
గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర ఎస్‌సి సంక్షేమ అసెంబ్లీ కమిటీ చైర్మన్‌ గొల్ల బాబూరావు, కమిటీ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ వారసులైన గురజాడ వెంకట ప్రసాద్‌, ఇందిరతో కలిసి గురజాడ రచించిన పుస్తకాలను, స్టాంపులను పట్టుకొని ర్యాలీగా ఆయన విగ్రహం వద్దకు చేరుకున్నారు. బాబూరావు మాట్లాడుతూ సమాజానికి గురజాడ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్‌, గురజాడ అప్పారావు లాంటి మహనీయుల జీవితాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

gurajada-death-anniversary-in-visakha-mvs