Sep 21,2023 06:30

(నేడు గురజాడ జయంతి)

గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్‌ 21- 1915 నవంబర్‌ 30) తన రచనల ద్వారా తెలుగు నాట సాంఘిక పరివర్తనకు కృషి చేసిన మహాకవి. 19వ శతాబ్ది ఆఖరిలోనూ, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందు తున్నాయి. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసి, ఆనాటి భాషోద్యమానికి కూడా గొప్ప తోడ్పాటునందిం చారు. ఆనాటి సమాజంలోని అకృత్యాలపై వ్యంగ్యశైలిలో దునుమాడుతూ రాసిన 'కన్యాశుల్కం' నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ఇప్పటి సమాజంలోనూ దర్శనమిస్తాయి.

  • కదిలించిన పూర్ణమ్మ

'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మకమైన కావ్యంగా, కరుణరస ప్లావితమైన గేయంగా రూపొందించారు. అందచందాలు రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కౌమార బాలిక బతుకు మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ. కొందరు తండ్రులు కన్యాశుల్కానికి ఆశపడి చిన్న వయసులోనే ఆడపిల్లల్ని ముసలి వరులకు కట్టబెట్టడాన్ని ఖండిస్తూ రాసిన ఈ గేయకథ చదువరుల హృదయాలను కదిలించేంత శక్తివంతమైనది.

  • గిడుగుకు తోడుగా ...

వాడుక భాషోద్యమ కర్త గిడుగు రామమూర్తి, మహాకవి గురజాడ విజయనగరం కళాశాలలో సహాధ్యాయులు. రచనలో, బోధనలో వ్యవహారిక భాష వినియోగించాల్సిన అవసరంపై ఇద్దరిదీ ఒకటే పట్టు. వాడుక భాష కోసం గిడుగు ఎంతగా ఉద్యమించాడో, ఏయే ప్రయోజనాలు ఉంటాయని చెప్పాడో ఆ ప్రయోజనాలను వాడుక భాషలో నాటకం, కవిత్వం, కథలూ రాయడం ద్వారా గురజాడ నిరూపించాడు. ఆ విధంగా వాడుక భాష ఉద్యమానికి గిడుగుకు తోడుగా, సరిజోడుగా నిలిచాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతంలో పూర్తి వాడుక భాషలో రచించాడు. ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించాడు.
1892లో గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించాడు. నాటకం విజయవంతమై అమిత ప్రజాదరణ పొందడం వాడుక భాషోద్యమానికి ఎంతో దోహదపడింది. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌, మద్రాసు వారు ప్రచురించారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో గురజాడ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం నాటకాన్ని తిరగ రాసాడు. గురజాడ 1910లో రాసిన ''దేశమును ప్రేమించుమన్నా'' దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది.
గురజాడ కాలంలోనే గురజాడను వ్యతిరేకించినవారు కొందరు ఉన్నారు. కొందరు ఆయన ఆధునిక భావాలను జీర్ణించుకోలేకపోయారు. మరికొందరు సాహిత్యపరంగా వాడుక భాషను వినియోగించటాన్ని తప్పు పట్టారు. అయితే, కాలక్రమంలో ఆ రెండు వాదనలూ, నిరసనలూ గాలివాటుగా కొట్టుకుపోయాయి. ''కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్ఛకటికం తప్ప మరోటి లేదు'', ''కన్యాశుల్కం బీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం'', ''కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ'' అని మహాకవి శ్రీశ్రీ పేర్కొన్నాడు. తెలుగు సాహిత్య అభ్యున్నతికి గురజాడ పరిచిన బాటలోనే తాను నడుస్తున్నానని సగర్వంగా ప్రకటించుకున్నాడు.

  • స్త్రీలకు అగ్ర తాంబూలం

''స్త్రీల కన్నీటి గాథలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవటం కూడా ఓ ప్రధాన కారణమే'' అని గుర్తించిన గురజాడ, ఎంత ఆధునికుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పీడిత కులాల జీవితాల్లో కూడా ఆ సమస్యకున్న ప్రాధాన్యాన్ని ఆయన గమనించారు. ఆర్థిక స్వాలంబనను కల్పించే ఆధునిక విద్యను అందరికీ అందించాలని గురజాడ ఆశించారు. అందుకు పనికొచ్చే విద్యా ప్రణాళిక గురించి ఆలోచించారు. ''పాటక జనాలను అభివృద్ధికి తెచ్చేందుకు పాతబడిన విద్యలు పనికిరావు. వారి స్థితిగతులను చక్కబరచి అభివృద్ధికి తేవడం ప్రజాస్వామిక లక్షణం'' అనే స్పష్టత ఆయనకు ఉంది కాబట్టే-''ప్రత్యక్ష జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషమ సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఈ వేద విజ్ఞానం ఒక్క పిసరు అక్కరకు రాదు'' అని పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళికలో మత సంబంధమైన ప్రాచీన సాహిత్యాన్ని బోధించడం వల్ల యువతరంలో కుల మతాల సంకుచితత్వం ప్రబలుతుందని ఆందోళన చెందారు.

  • సమాజానికి వెలుగు జాడ

160 ఏళ్ల క్రితం పుట్టి, నూటా ఎనిమిదేళ్ల క్రితమే మరణించిన గురజాడ ఇప్పటికీ మన సమాజానికి వెలుగు జాడ. ఆ దారిలో మనం గమ్యానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇటీవల ఛాందస, మతోన్మాద భావాల వ్యాప్తి ఆ విజ్ఞాన ప్రయాణాన్ని మరింత మసకబారుస్తోంది. అనేక వివక్షలపై, వెనకబాటు భావాలపై, గతమంతా గొప్పదనుకునే వెధవాయతనంపై గురజాడ చాలా స్పష్టంగా, సమరశీలంగా తన అభిప్రాయాలను వెల్లడించాడు. వాటిని అందుకోవాల్సి ఉంది. విద్యావిధానంలో, మహిళలను గౌరవించటంలో, తోటి మనిషిని ప్రేమించటంలో, శ్రమను గౌరవించటంలో, కులమతాలకు దూరంగా మసలటంలో గురజాడ చూపిన వెలుగు దారి ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శనీయం, అనుసర ణీయం. తెలుగువారి వెలుగు జాడ మన గురజాడ. నవ్య కవిత్వానికి వేగుచుక్కలా నిలిచి, మూఢనమ్మకాలను ఎదిరించి సత్యము బోధించి శాస్త్ర జ్ఞానాన్ని సమూలంగా అభ్యసించా లని చాటిన క్రాంతదర్శి. ''దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుజులోరు'' అన్న పిలుపు ఇప్పుడు మరింతగా మననం చేసుకోవాల్సినది. అక్షరక్షరం పాటించి తీరాల్సినది. ఆ మహానుభావుడి మాటల బాటలో చెట్టపట్టాల్‌ పట్టుకొని నడవడమే మనమందరం ఆయనకిచ్చే ఘన నివాళి!


వ్యాసకర్త తెలుగు ఉపన్యాసకులు: కొప్పుల ప్రసాద్ 
సెల్‌ : 98850 66235