Sep 21,2023 06:33

సనాతన ధర్మం మీద దాడి జరుగుతోందని, దానిని తిప్పికొట్టాలని ప్రజలకు మన దేశ ప్రధాని స్వయంగా పిలుపునిచ్చారు. తమిళనాడు మంత్రి దయానిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటీవల చేసిన ప్రసంగాన్ని ఆధారం చేసుకుని మోడీ తన ఎదురుదాడిని ప్రారంభించారు. ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటో ముందు చెప్పి, దానిని కాపాడమని మోడీ చెప్పివుంటే కొంతైనా అందులో నిజాయితీ ఉందని ఒప్పుకోవచ్చు. కాని మోడీ సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పలేదు. దయానిధి స్టాలిన్‌ అలా కాదు. సమాజంలో నేటికీ అనాది నుండీ కొనసాగుతూవున్న వివిధ తరహాల వివక్షతలకు మూలం అయిన సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇది మనం మొదట గమనించాలి.
అనాదిగా సమాజంలో కొనసాగుతున్న భావాలను, సిద్ధాంతాలను, సాంప్రదాయాలను, నమ్మకాలను, ఆచారాలను అన్నింటినీ సనాతనమైనవిగా పరిగణిస్తాం. పురాతన కాలంలో గొప్పవిగా చలామణీ అయిన భావాలన్నీ ఇప్పుడూ గొప్పవిగా చలామణీ కాకపోవచ్చు. వాటిలో కొన్ని ఇప్పటికీ గొప్పవి గానే చలామణీ అవుతూ వుండవచ్చు కూడా. కనుక సనాతన అన్న పదం తగలగానే అది తప్పకుండా గొప్పదే అయివుండాలన్న రూలు ఏమీ లేదు. నరబలి, సతీ సహగమనం, దేవదాసీ విధానం, అంటరానితనం వంటివి గొప్పవి అని ఎవరైనా చెప్తారా? పోనీ మన ప్రధాని మోడీ గారు చెప్పగలరా?
''రాజ్యం వీరభోజ్యం'' అని పాత కాలంలో అనేవారు (దానిని అప్పటి సామాన్య ప్రజానీకం అందరూ అంగీకరించే వారా అంటే అవును అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం.).
ఛత్రపతి శివాజీని హిందూ ధర్మ రక్షకుడు అని ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పొగుడుతారు. కాని అదే శివాజీ తన బల పరాక్రమాలతో (తన సైన్యం బల పరాక్రమాలు కూడా కలిపే అనుకోండి) మరాఠా రాజ్య సింహాసనాన్ని అధిష్టించడానికి పట్టాభిషిక్తుడు అవుదామనుకుంటే అప్పట్లో ఏ ఒక్క బ్రాహ్మడూ ఆ పట్టాభిషేకపు మతపరమైన తంతును నిర్వహించడానికి ఒప్పుకోలేదట. కారణం శివాజీ ఒక శూద్ర కులానికి చెందినవాడవడమే.
చివరికి శివాజీ ఎవడో ఒక మూల ఉన్న పేద బ్రాహ్మడిని పట్టుకుని అంతులేని కానుకలను దక్షిణగా ఇస్తే, అప్పుడు కూడా ఆ బ్రాహ్మడు తన కాలి బొటనవేలితో శివాజీ నుదుట తిలకం దిద్దేడట. ఇది కథ కాదు, చరిత్ర. దానిని రాసినందుకే గోవింద పన్సారే ని ఆర్‌ఎస్‌ఎస్‌ హంతకులు పొట్టన పెట్టుకున్నారు (ఆ విధంగా అది వాస్తవ చరిత్రేనని వాళ్ళే ఒప్పుకున్నట్టైంది).
రాజ్యం వీర భోజ్యం అని స్వయానా శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో చెప్పేడని అంటారు. మరి శ్రీకృష్ణుడు చెప్పిన ఆ ధర్మాన్ని పాటించి యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించిన శివాజీకి బ్రాహ్మలు ఎందుకు పట్టాభిషేకం చేయలేదు? ఆ బ్రాహ్మలు సనాతన ధర్మాన్ని (దేవుడే స్వయంగా చెప్పేడని కదా అంటారు?) పాటించేరా? లేక శివాజీ పాటించేడా? సనాతన ధర్మం ప్రకారం క్షత్రియులు మాత్రమే రాజులుగా పాలించాలి. కాబట్టి బ్రాహ్మలు ఆ విధంగా వ్యవహరించేరు అని సమర్ధించుకుంటే అప్పుడు శివాజీ సనాతన ధర్మాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ళే చెప్పాలి సనాతన ధర్మాన్ని ధిక్కరించిన శివాజీ వాళ్ళకి ఎందుకు హీరో అయ్యాడు? ఇప్పుడు దయానిధి స్టాలిన్‌ ఎందుకు విలన్‌ అయ్యాడు?
చెప్పొచ్చేదేమంటే మానవ సమాజం నిరంతరం ముందుకు సాగిపోతూనే వుంటుంది. ప్రతీ దశలోనూ మానవులు కొన్ని సాంప్రదాయాలను, ఆచారాలను, విశ్వాసాలను రూపొందించుకుంటారు. కొన్నాళ్ళు గడిచాక ఆ సాంప్రదాయాలలో కొన్ని సమాజ పురోగతికి అవరోధాలుగా మారిపోతాయి. ఆచారాలలో కొన్ని దురాచారాలుగా పరిగణింప బడతాయి. విశ్వాసాలలో కొన్ని మూఢ విశ్వాసాలుగా మారిపోతాయి.
ఇలా సమాజ పురోగతికి అవరోధాలుగా మారిన వాటిని తిరస్కరించి కొత్త సాంప్రదాయాలను, కొత్త ఆచారాలను మానవులు రూపొందించుకుంటారు.
అదే సమయంలో కొన్ని ఆదర్శాలు, సాంప్రదాయాలు సమాజం ఎంత మారినా వాటి విలువను పోగొట్టుకోవు. చాలా పురాతనమైన శాంతి మంత్రం ఈ విధంగా ఉంటుంది:
సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై-అంటే మనమంతా కలిసి జీవిద్దాం, కలిసి నేర్చుకుందాం, కలిసి మన శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకుందాం, మన మధ్యలో విద్వేషాలు వద్దు అని అర్ధం.
సర్వేపి సుఖినస్సంతు-అంటే అందరూ సుఖంగా ఉండాలి.
సర్వే భద్రాణి పశ్యంతు-అంటే అందరూ శుభములనే చూడాలి (అందరికీ శుభాలు కలగాలి).
మా కశ్చిద:కభాగ్భవేత్‌ -అంటే ఏ ఒక్కడూ దు:ఖితుడు కారాదు.
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు అంటే సకల లోకములలోనూ సుఖశాంతులు నెలకొనుగాక.
వసుధైవ కుటుంబకమ్‌ అంటే ఈ భూమండలమంతా ఒకే కుటుంబం అన్న భావనను కలిగి వుండడం.
పైన చెప్పినవన్నీ సనాతన భావాలే. కాని ఉదాత్తమైన భావాలు.
ఓం శాంతి: శాంతి: శాంతి: అని మంత్రాలు చదవడానికి మోడీ గారికి ఏ అభ్యంతరమూ లేదు. వసుధైవ కుటుంబకమ్‌ అని కూడా అంటూ వుంటారు. కాని ప్రపంచంలో ఇప్పుడు జరిగే యుద్ధాలకు, ఆయుధ పోటీకి, సైనిక కూటముల ఏర్పాటుకు నాయకత్వం వహిస్తున్న అమెరికాకు పూర్తి విధేయుడిగా ఉంటారు మోడీ. ''చెప్పడానికే నీతులు....'' అన్న సామెత ఊరికే వచ్చిందా?
వెరసి గత కాలపు భావాలలో, ఆచారాలలో, సాంప్రదాయాలలో మనం ముందుకు సాగడానికి ఉపకరించే వాటిని మాత్రం కొనసాగిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భావాలకు, కొత్త సాంప్రదాయాలకు మనం స్వాగతం పలకాలి. అందుకే మహాకవి గురజాడ 'మంచి గతమున కొంచెమేనోరు, మందగించక ముందడుగేరు' అని దిశానిర్దేశం చేశాడు.
ఇంతవరకూ సనాతన భావాల గురించి చర్చించాం. ఇక సనాతన 'ధర్మం' గురించి చర్చించాలి. ఇప్పుడు మోడీ గొడవ అంతా ఆ సనాతన ధర్మం గురించే.
ధర్మం అంటే ఆయా కాలాల్లో సమాజం మీద ఆధిపత్యాన్ని చెలాయించిన వారు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి రూపొందించిన నిబంధనలు. ఆదిమ కాలంలో పాలకులు, పాలితులు అంటూ వేరే వేరే లేరు గనుక ధర్మం అంటూ వేరే లేదు. కేవలం కొన్ని విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాలు రూపొందాయి. ఒకసారి సమాజం వేర్వేరు వర్గాలుగా చీలిపోయాక ఆధిపత్య వర్గాలు ఏర్పడ్డాక ధర్మం అనే ప్రస్తావన ముందుకొచ్చింది.
మన దేశంలో వర్గాలుగా సమాజం విడిపోవడం, కుల వ్యవస్థ రూపొందడం, దాదాపు ఏకకాలంలో జరిగాయి. బ్రాహ్మణ, క్షత్రియ కులాలకు చెందినవారు ఆధిపత్య వర్గంగా వ్యవహరించడం మొదలయ్యాక వారి ఆధిపత్యంతోబాటు, దోపిడీతోబాటు కుల వ్యవస్థ విస్తరించింది. దానితోబాటు దిగువ కులాలవారిని అణచివేయడమూ పెరిగింది. తమ ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి స్మృతులు లేదా ధర్మ శాస్త్రాలు రూపొందాయి. అందులో పేర్కొన్న ధర్మాలు సమాజం మొత్తం ఆమోదించినవి ఎంతమాత్రమూ కావు. కొద్దిమంది ఆధిపత్య కులాలవారు మాత్రమే వాటిని వారి పెత్తనం కొనసాగడం కోసం రూపొందించుకున్నారు. అలా వచ్చినవే మను స్మృతి, నారద స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, కౌటిల్యుడి అర్థశాస్త్రం వంటివి. ఇవన్నీ పాలకులు పాలకులకోసం రాసుకున్నవి. కాని అవి అమలు కావాలంటే వాటిని ప్రజల మీద రుద్దాలి. అందుకే ఆ దోపడీ వర్గ ధర్మాలకు అక్కడక్కడా కొన్ని మంచి మాటల ముసుగు వేసి ప్రచారం చేశారు. అందుకోసం పురాణాలను రాశారు.
ధర్మాన్ని రక్షిస్తాను అని ప్రతీ రాజూ అధికారం చేపట్టినప్పుడు ప్రతిజ్ఞ చేయాలి (ఇప్పుడు పదవి కావాలంటే ఎన్నికల్లో గెలిచాక రాజ్యాంగానికి లోబడివుంటాను అని ప్రమాణం చేసినట్టు). ధర్మాన్ని కాపాడడంలో విఫలుడైన రాజును పదవి నుండి తొలగించే అధికారం ధర్మవేత్తలకు ఉండేది.
మనస్మృతి ఏం చెప్పిందో మనం గతంలో చాలాసార్లు ప్రస్తావించుకున్నాం గనుక ఆ వివరాల జోలికి ఇప్పుడు పోవడం లేదు. కాని సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను, అత్యధిక మెజారిటీగా ఉన్న శూద్ర, అతిశూద్ర, దళిత కులాలవారిని అత్యంత దుర్మార్గంగా పాలకులు అణగదొక్కడానికి ఊతం ఇచ్చినది ఈ మనుధర్మ శాస్త్రమే. ఈ క్రమంలో మన ఉపఖండంలో సమాజం ముందుకు పురోగమించకుండా ప్రధాన ఆటంకంగా తయారైనది కూడా ఈ మనుధర్మ శాస్త్రమే.
దీనిని గ్రహించిన అభ్యుదయ వాదులు దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ వివిధ తరహాల సంస్కరణోద్యమాలను నడిపారు. మన తెలుగునాట కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గురజాడ, భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న తదితరులు మనువాదాన్ని ఎదిరించి నూతన అభ్యుదయ సాంప్రదాయాలకు తెర తీశారు. ఆ సంస్కరణోద్యమ ఒరవడిని భారత జాతీయోద్యమం కూడా కొంతమేరకు అందిపుచ్చుకుంది. ఫూలే, అంబేద్కర్‌, పెరియార్‌ వంటి మహనీయులు సంఘానికి పట్టిన మనువాదపు చీడను వదిలించడానికి చాలా గొప్ప కృషి చేశారు. అత్యధికులు ప్రజానీకం సంస్కరణ ఉద్యమాలను స్వాగతించారు ఒక ఆధునిక సమాజంగా మన దేశాన్ని ముందుకు నడిపించాలన్న బలమైన కోరిక జాతీయోద్యమంలో పాల్గొన్న అశేష ప్రజానీకంలో వ్యక్తమైంది. దాని పర్యవసానంగా మన రాజ్యాంగం రూపొందింది.
మన దేశంలో తతిమ్మా ప్రజానీకం అంతా రాజ్యాంగం రూపొంది, ఆమోదం పొందిన రోజున పండుగ చేసుకున్నారు. కాని ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం దానిని ఒక దుర్దినంగా పేర్కొంది. మను ధర్మశాస్త్రం మనకి ఉండగా మళ్ళీ వేరే రాజ్యాంగం ఎందుకన్న వాదనను ఆర్గనైజర్‌ పత్రిక చేసింది. స్వాతంత్య్రోద్య మానికి దూరంగా ఉంటూ అప్పటి బ్రిటిష్‌ పాలకులకు విధేయులుగా వ్యవహరించిన ప్రబుద్ధుల నుంచి వేరే ఇంకేం ఆశించగలం?
ఇప్పుడు ఆ హిందూత్వ శక్తులే అధికారంలో ఉన్నాయి. పేరుకి రాజ్యాంగానికి విధేయులుగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేసినా, నిజానికి వాళ్ళకు మనువాదమే ముఖ్యం. సనాతన ధర్మం అంటే వారి దృష్టిలో మను ధర్మమే. ఐతే నేరుగా మను ధర్మాన్ని అమలు చేస్తాం అని చెప్పే సాహసం వారిప్పుడు చేయలేరు. కనుక దానికి బదులుగా సనాతన ధర్మం అన్న పదాన్ని ముందుకు తెచ్చారు. ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, స్వేచ్ఛ, సమానత్వం వంటి భావాలకు వారి దృష్టిలో ఎటువంటి విలువా లేదు.
కాబట్టి సనాతన ధర్మం అన్న పదాన్ని చూసి దీనిని వ్యతిరేకించడం అంటే గతంలో మన సమాజం అప్పటా, అప్పటా సాధించిన విజయాలను వ్యతిరేకించడం అని అనుకోకూడదు. మనం గొప్పగా చెప్పుకునే గతకాలపు ఔన్నత్యం చాలా పరిమితం. ఇప్పుడు పేదరికంతో, అవిద్యతో, నిరుద్యోగంతో, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది ప్రజల కడగండ్లను తీర్చి ''లోకాస్సమస్తా స్సుఖినోభవంతు'' అన్న సనాతన ఆదర్శం నెరవేర్చాలంటే ఈ సనాతన మనువాద ధర్మాన్ని నిలువులోతు గొయ్యి తీసి పాతి పెట్టాల్సిందే. కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిందే. ''యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా'' (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంగా సంచరిస్తారు) అన్న భావన ఆచరణలోకి రావాలంటే మను వాదానికి, దానిని సమర్ధించేవారికి మన సమాజంలో చోటు లేకుండా తరిమి కొట్టాల్సిందే.
ఈ విషయం మీద చర్చకు తెర తీసినందుకు దయానిధి స్టాలిన్‌ను అభినందించాలి. ఐతే అక్కడితో సరిపోదు. సమాజాభ్యుదయాన్ని కోరే అన్ని శక్తులూ రంగంలోకి రావాలి. చేయి చేయి కలపాలి. యావత్‌ ప్రజానీకాన్నీ కదిలించాలి.
ఓం శాంతి: శాంతి: శాంతి:

- ఎం.వి.ఎస్‌. శర్మ