బాపట్ల : తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారిలో గురజాడ అప్పారావు ప్రముఖులని, వారు సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సాహిత్యాన్ని ఒక బలమైన ఆయుధంగా ఉపయోగించిన మహౌన్నత సాహితీవేత్త అని ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్.శ్రీనివాస్ కొనియాడారు.
బుధవారం సాహితీ భారతి, ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ ఆధ్వర్యంలో గురుజాడ అప్పారావు 107 వ వర్ధంతి సభకు ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ ... ఆనాడు సమాజంలో పాతుకుపోయిన కన్యాశుల్కం దురాచారాన్ని రూపుమాపటానికి ''కన్యాశుల్కం'' నాటకాన్ని, బాల్యవివాహాలను దూరం చేయటానికి ''పుత్తడి బమ్మ పూర్ణమ్మ'' రచనను రచించారని, కన్యాశుల్కం నాటకం ఈనాటికి కూడా ప్రపంచ ఉత్తమ నాటకాలలో ఒకటిగా పరిగణింపబడుతుందని, వారు రూపొందించిన ముత్యాల సరాలు అనే సాహితీ సఅజన ఈనాటికి కూడా యువ కవులకు అనుసరణీయంగా మారిందని అన్నారు. గురుజాడ అప్పారావు అభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర అనే బిరుదులతో సత్కరింపబడ్డారని, సారంగధర అనే ఇంగ్లీషు పద్య కావ్యం తో పాటు నీలగిరి పాటలు, సుభద్ర, లవణ రాజు కల, సౌదామిని, కన్యక, వంటి ఎన్నో రచనలు చేశారని సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రిమాల్యాద్రి రావు అన్నారు. గిడుగు రామమూర్తితోపాటు వ్యవహారిక భాషోద్యమంలో పోరాడి వ్యవహారిక భాష అభివఅద్ధికి ఎంతో కృషి చేశారని సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ ప్రశంసించారు. ఈ సభలో జాకబ్, ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, మురళీ రాధా కృష్ణమూర్తి, తదితరులు పాల్గొని గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.