పాలస్తీనా రచయితల గొంతు నొక్కేస్తున్నారు ! : ప్రపంచవ్యాప్తంగా 1300మందికి పైగా రచయితలు, ప్రచురణకర్తల నిరసన
- మద్దతు లేఖపై సంతకాలు
న్యూఢిల్లీ : రచయిత ఆదానియా షిబ్లితో సహా పాలస్తీనా సాహిత్య కళాకారులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా 1300మందికి పైగా రచయితలు, ప్రచురణకర్తలు ఒక లేఖపై సంతకాలు చేశారు. వీరిలో నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా వున్నారు. ఇజ్రాయిల్‌పై హమస్ దాడి నేపథ్యంలో పాలస్తీనియన్ల కళలు, కథనాలు, వారి రచనలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరందరూ మద్దతు లేఖను విడుదల చేశారు. అరబిక్ నుంచి అనువాదం చేసిన అనేక రచనలతో మూడు మాసాలకోసారి వెలువడే అరబ్‌లిట్ మేగజైన్‌ను ప్రచురించే సంస్థ అరబ్‌లిట్ ప్రయత్నాల మేరకు ఈ మద్దతు లేఖ విడుదల చేశారు. పాలస్తీనా రచయితలకు సంబంధించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలను పలు యురోపియన్ దేశాల్లో రద్దు చేసినట్లు వార్తలు వెలువడ్డాయని అరబ్‌లిట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రతిష్టాత్మక అవార్డు పొందిన పాలస్తీనియన్ రచయిత అదానియా షిబ్లి ఆ అవార్డును అందుకునే కార్యక్రమాన్ని రద్దు చేయడాన్ని ఆ లేఖ ప్రస్తావించింది. వచ్చే వారం ఫ్రాంక్‌ఫర్ట్‌లో పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. అందులో షిబ్లి రాసిన పుస్తకానికి గానూ 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జర్మనీ అవార్డు అందుకోవాల్సి వుంది. ఈ పుస్తక ప్రదర్శనలో ఆమె ఆ అవార్డును అందుకోలేరంటూ నిర్వాహకులు ఈ నెల 13న తెలియజేశారు. పైగా పుస్తక ప్రదర్శనలో షిబ్లి, ఆమె అనువాదకురాలితో జరగాల్సిన చర్చను కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా షిబ్లికి తెలియచేశామని నిర్వాహకులు తప్పుడు ప్రకటన చేశారు. కానీ షిబ్లి ముందుగా తనకు ఏ విషయం తెలియజేయలేదని, నిర్ణయం తీసుకున్న తర్వాతే తెలియజేశారని చెప్పారు. ఇజ్రాయిల్‌లో యుద్ధం కారణంగా అదానియా షిబ్లి వాణిని నొక్కివేయడానికి చేసే ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారని ఆ లేఖ విమర్శించింది. ఇది పిరికిపంద చర్య తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించింది.