Jul 19,2023 16:12

వాషింగ్టన్‌ :     ఎఐ కంపెనీలు తమ అనుమతి లేకుండా 'కాపీరైటెడ్‌ వర్క్‌'ని నిలిపివేయాలని రచయితలు కోరారు. అమెరికాలోని ప్రముఖ రచయితల సంఘం 'ఆథర్స్‌ గిల్డ్‌' ఓపెన్‌ ఎఐ, మెటా, మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌, ఐబిఎం మరియు స్టెబిలిటీ ఎఐ సంస్థల సిఇఒలకు లేఖ రాసింది. ప్రముఖ రచయితలు మార్గరెట్‌ అట్వుడ్‌, జోన్‌థాన్‌ ఫ్రాంజెన్‌, జేమ్స్‌ పాటర్సన్‌, సుజన్నే కొలిన్స్‌, వియెట్‌ తన్హ్‌ జుయెన్‌ సహా వేలాది మంది రచయితలు ఈ లేఖపై సంతకాలు చేశారు. తమ అనుమతి, గుర్తింపు, లేదా నష్టపరిహారం లేకుండా మీ సంస్థలకు చెందిన ఎఐ వ్యవస్థ తమ రచనలను తీసుకోవడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఈ సాంకేతికత తమ రచనల్లోని పాత్రలను, లేదా భాష, శైలి, కథలు, ఆలోచనలను అనుకరించడం లేదా పునర్జీవింప చేస్తున్నాయని పేర్కొన్నారు.

వేలాది కాపీరైట్‌ పుస్తకాలు, ఆర్టికల్స్‌, రచనలు, కవితలు ఎఐ వ్యవస్థకు జీవం (ఆహారం) పోస్తున్నాయని, కానీ ఎటువంటి బిల్లు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఎఐ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు వందకోట్ల డాలర్లను ఖర్చుచేస్తున్నారని, వాటిలో కొంత భాగం తమ రచనలను వినియోగించుకుంటున్నందుకు పరిహారంగా చెల్లించడం న్యాయమని పేర్కొన్నారు. తమ రచనలు లేకుండా ఎఐ సాదాసీదాగా, చాలా పరిమితంగా ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. చాట్‌ జిపిటికి చెందిన ఎఐ మోడల్స్‌ మానవ ప్రసంగాన్ని అనుకరించేందుకు ఇంటర్నెట్‌ నుండి సమాచారాన్ని సేకరిస్తోంది.