Jan 21,2023 21:24

- కవులు, కళాకారులతోనే చరిత్ర మనుగడ
- పలాసాకాశీబుగ్గ మున్సిపల్‌ ఛైర్మన్‌ బల్ల గిరిబాబు
ప్రజాశక్తి - పలాస (శ్రీకాకుళం జిల్లా) :
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఎస్‌ఎంసి ఫంక్షన్‌ హాల్‌లో ఉత్తరాంధ్ర రచయితల మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సభలు రెండురోజులపాటు కొనసాగనున్నాయి. ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యాన ప్రారంభమైన సభలను పలాస, కాశీబుగ్గ మున్సిపల్‌ చైర్మన్‌ గిరిబాబు ప్రారంభించి, మాట్లాడారు. కవులు, కళాకారులతోనే చరిత్ర మనుగడ ఉంటుందన్నారు. కొత్త రచయితలను చైతన్యపర్చడానికి ఈ మహాసభలు దోహదపడతాయన్నారు.. దళిత సాహిత్యకారులు జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ.. ప్రజా కళలు, సంప్రదాయాలు ఉత్తరాంధ్ర ప్రత్యేకత అని, అవి అంతరించిపోకముందే వాటిని డాక్యుమెంట్‌ చేసి బతికించాలని కోరారు. కళలు బతికితేనే కళాకారుడు బతుకుతాడని తెలిపారు. ఈ కళలే రేపటి ఉత్తరాంధ్రకు, ప్రజా ఉద్యమానికి ఊపిరి పోస్తాయన్నారు. శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు చిట్టి వెంకటరావు మాట్లాడుతూ.. సమాజానికి దిక్సూచి కళాకారుడు అని, కళాకారులను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్‌ అందెశ్రీ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర సాహిత్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రపంచ పటంపై నిలవాలని కోరారు. ఎపి జానపద కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్‌ నాయక్‌ అధ్యక్షత వహించారు. ఉద్దానం సాహిత్య, సంస్కృతిక వేదిక అధ్యక్షులు లండన్‌ రుద్రమూర్తి, గౌరవ సలహాదారులు తెప్పల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కుతం వినోద్‌, కార్యదర్శి శివ జ్యోతి, గౌరవ అధ్యక్షులు వంకల రాజారావు, బండారు కాలి దాసు, గంటిడి గౌర్నాయుడు, వివి.సతీష్‌, దానేటి పద్మజీ, తదితరులు పాల్గొన్నారు