Oct 13,2023 16:24
  • రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం డిమాండ్‌

ప్రజాశక్తి-విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనుకబడిపోయాయి విశాఖపట్నానికి మకాం మార్చితే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం ధ్వజమెత్తారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడుతో కలిసి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ఇదివరకే ప్రకటించారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ప్రకటన చేశారు. కానీ జిఓ ఆర్‌టి నెంబరు 2015ను 11-10-23న ఆఘమేఘాలపైన విడుదల చేసారు. ఇందులో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, అందులో ఏజెన్సీ ప్రాంతం మరింత వెనుకబాటకు గురయిందని అందుకు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ పెట్టి అక్కడే ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందని పేర్కొనడం విడ్డూరం. వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ళలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేసారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసారు. 

  • ఉత్తరాంధ్ర ప్రజలకు త్రాగునీరు, సాగునీరుకోసం చేపట్టే సుజలశ్రవంతి ప్రాజెక్టు పనులకోసం ఎంత నిధులు కేటాయించారో, రైతులకు ఏం మేలు చేసారో తెలపాలన్నారు.
  • ఉత్తరాంధ్రలో కోపరేటీవ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలు, ఫెరోఎలాయిస్‌, జూట్‌ కంపెనీలు మూతపడటానికి కారణం మీరు కాదా? అప్పటికే మూతపడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తెరిపించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
  • స్టీల్‌ప్లాంట్‌ ఉత్తరాంధ్రాకే కాకుండా ఆంధ్రరాష్ట్రానికే తలమానికం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగ గత 970 రోజులుగా పోరాటం జరుగుతున్నది. లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను రక్షించడంలో మీ ప్రభుత్వపాత్ర ఏమిటి?
  • గంగవరం పోర్టును అధానీకి ఎందుకు కట్టబెట్టారు? పైగా స్టీల్‌ప్లాంట్‌ కు రావాల్సిన ముడిసరుకును ఎందుకు ఆపించేశారు?
  • విశాఖపట్నం ఏజెన్సీలో ఆదిమ తెగ ఉంది. బాగా వెనుకబడినవారు, వారికోసమే నేను విశాఖపట్నం మకాం మార్చుతున్నామని జివో లో పేర్కొన్నారు. వీరంతా వామపక్ష ఉగ్రవాదం వైపు వెళ్ళిపోతున్నారని ఆ జివోలో పేర్కొనడం దుర్మార్గమైనది. గిరిజన ప్రాంతంలో మౌళిక సదుపాయాలు, విద్య, వైద్యం కల్పించడంలో మీ ప్రభుత్వం విఫలమవటమే కాకుండా గిరిజనులకు అంత్యోదయ కార్డుల ద్వారా ఇచ్చే రేషన్‌ ఎందుకు నిలుపుదలచేసారు?. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎంతమందికి కల్పించారని ప్రశ్నించారు.  
  • ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా 6116 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూములు రైతులనుండి బలవంతంగా ఎందుకు లాక్కున్నారు?
  • రైల్వేజోన్‌, వాల్తేరు డివిజన్‌, మెట్రోరైలు, గిరిజన యూనివర్శిటీ వంటి విభజన హామీలు, వెనుకుబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్ర నుండి రావాల్సిన ఏడాదికి 50కోట్ల నిధులు కోసం ఏం ప్రయత్నం చేసారని ప్రశ్నించారు.

      ఈ ప్రశ్నలకు సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. విశాఖపట్నం మీరు మకాం మార్చడమంటే ఉత్తరాంధ్రలో ఉండే కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దోచుకోవడానికి, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి తప్ప ఇంకొకటి కాదన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర వెనుకబడిరది తప్ప ఉత్తరాంధ్రలో ఉండే రాజకీయపార్టీల నాయకులు వెనకబడిలేరు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదన్నారు. పైగా చిరువ్యాపారస్తులు, అసంఘటితరంగ కార్మికుల ఉపాధి పోయే ప్రమాదముందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, నిధులు మంజూరు చేయాలి, ప్రభుత్వరంగ సంస్థలను రక్షించడంతో పాటు ఉత్పత్తిరంగంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ దిశ ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు.