జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల జివో నిబంధనలు సడలించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
అమరావతి: జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల జివో నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రకటనలో ఏముందంటే..''జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ఫ్రభుత్వం నిర్ణయించడం స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఇటీవల వచ్చిన జిఓలో ఉన్న కొన్ని అంశాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగాలేవు. మొదటిది జర్నలిస్టులు 40శాతం షేర్ ఇవ్వాలన్న నిబంధన సరికాదు. స్థలం కోసమే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వమే గతంలో ఇచ్చినట్లు ఉచితంగా (నామినల్ రేట్‌కి) ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఇచ్చిన నిబంధనల్లో పేర్కొన్న అంశాల్లో జర్నలిస్టు భార్యకుగానీ, జర్నలిస్టుకుగానీ ఇల్లు ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలానికి అర్హులు కాదని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాదిమంది జర్నలిస్టులకు న్యాయం జరిగే అవకాశం లేదు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టుకు సమాచార పౌర సంబంధాల శాఖ జారీచేసిన అక్రిడిటేషన్‌ను ప్రామాణికంగా తీసుకుని అర్హులను ఎంపిక చేసి వారికి స్థలాలు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇళ్ళ స్థలాల జిఓకు నెంబరు లేదు. నెంబరు కేటాయించాలని కోరుతున్నాను.'' అని అన్నారు.