- ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
ప్రజాశక్తి-నందిగామ : ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. శనివారం ఉదయం నందిగామ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి రవాణా శాఖ అధికారులు మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు "వాక్ థాన్" కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ పురవీధుల్లో కలియ తిరుగుతూ నగర పౌరులకు -వాహనదారులకు రోడ్డు భద్రత వారోత్సవాల కరపత్రాలు పంపిణీ చేస్తూ, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ ప్రాణం ఎంతో విలువైనదని, వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. వాహర చోదకులు రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలన్నారు. జాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనాలు అతివేగంగా నడిపేటప్పుడు ఒకసారి మనకోసం ఎంతో ఆప్యాయతతో ఎదురుచూసే కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో భద్రత వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. నందిగామ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసే క్రమంలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిరుమామిళ్ల చిన్ని, మన్నెం శ్రీరాంమూర్తి, రవాణా శాఖ అధికారి ఎంవిఎన్ రాజు, ఎస్సై పండు దొర, పలువురు కౌన్సిల్ సభ్యులు -వార్డు ఇన్చార్జిలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు ..










