Oct 21,2023 15:47

ప్రజాశక్తి - ఆలమూరు : 216ఏ జాతీయ రహదారిపై చొప్పెల్ల లాకుల వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గుర్తు తెలియని వాహన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.  ఎస్సై ఎల్.శ్రీను నాయక్  తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మూలస్థాన అగ్రహారంకి చెందిన అడపా మురళి వెంకటేశ్వర్లు(48) మండపేట మొబైల్ షాపులో పని చేసుకుంటున్నాడు. యధావిధిగా శుక్రవారం రాత్రి తన పనిని ముగించుకుని బైకుపై రాజమహేంద్రవరం వైపు నుండి తన స్వగ్రామమైన మూలస్థాన అగ్రహారం చేరుకునెందుకు 216ఏ జాతీయ రహదారిపై వస్తున్నాడు. ఈ క్రమంలో చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చుసరికి ఏదో గుర్తు తెలియని వాహనం వెనుక నుండి బలంగా ఢీకొని అతని మీదుగా వెళ్ళిపోయింది. దీంతో  వెంకటేశ్వర్లు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి కుమారుడు మణికంఠ శనివారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.