
శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్‌లో సెలవుపై వెళ్లిన జవాన్ అదృశ్యమయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు కాశ్మీర్ పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లాకు చెందిన రైఫిల్‌మెన్ జావేద్ అహ్మద్ జమ్మూ మరియు కాశ్మీర్ లైట్ ఇన్‌ఫ్రాంటీ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈద్ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం విధుల్లో చేరాల్సి వుంది. నిన్న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో మార్కెట్‌లో కొన్ని వస్తువులను కొనేందుకు వెళ్లాడని, రాత్రి 9 గంటల వరకు తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో అతని కోసం గాలించగా మార్కెట్ సమీపంలో కారు లభించిందని, రక్తపు మరకలు ఉన్నాయని అన్నారు. కేసు నమోదు చేసి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు అతనిని కిడ్నాప్ చేశారని అనుమానిస్తున్నామని, అతనిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారని అన్నారు. తన కుమారుడు లఢక్ లో విధులు నిర్వహిస్తున్నారని, ఈద్ సందర్బంగా ఇంటికి వచ్చాడని జావేద్ అహ్మద్ తండ్రి పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, దయచేసి అతనిని విడిచిపెట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన ఓ సందేశంలో పేర్కొన్నారు. గతంలో సెలవుపై ఇంటికి వచ్చిన పలువురు సైనికులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన సంగతి తెలిసిందే.