బెర్లిన్ : జర్మనీ సమీపంలోని సముద్రంలో రెండు భారీ నౌకలు మంగళవారం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు జర్మనీ అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున హెల్గోలాండ్ ద్వీపానికి నైరుతి దిశలో 22 కి.మీ దూరంలో బ్రిటన్‌కు చెందిన వెరైటీ, బహమాస్‌కు చెందిన పోలేసీ నౌకలు ఢీ కొన్నట్లు జర్మనీకి చెందిన సెంట్రల్ కమాండ్ ఫర్ మారీటైమ్ ఎమర్జెన్సీస్ తెలిపింది. వెరైటీ నౌక పూర్తిగా నీటిలో మునిగిపోగా, ఒకరిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. 91 మీటర్లు పొడవు, 14 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఓడ జర్మనీలోని బ్రమెన్ నుండి ఇమ్మింగ్‌హామ్‌కు వెళుతోంది. అయితే ఈ నౌకలో ఎంత మంది ఉన్నారనే అంశంపై సమాచారం లేదు.
మరోనౌక పోలేసీ హామ్‌బర్గ్ నుండి స్పెయిన్‌కు వెళుతోందని, ఈ నౌకలో 22 మంది ఉన్నట్లు తెలిపారు. అయోనా క్రూయిజ్ నౌక ద్వారా సహాయక చర్యలు అందిస్తున్నట్లు ఎమర్జెన్సీ కమాండ్ తెలిపింది. అత్యవసరమైతే. హెలికాఫ్టర్ ద్వారా సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.