
- ఉత్తర్వులను ఉపసంహరించుకోండి : ప్రధాని మోడీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ : గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసే బాధ్యతలను సీనియర్ అధికారులకు అప్పగిస్తూ ఇటీవల జారీచేసిన సర్క్యులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని నరేంద్రమోడీకి ఖర్గే లేఖ రాశారు. ఇలాంటి ఉత్తర్వులు అధికార యంత్రాంగాన్ని 'రాజకీయం' చేయడమే అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 18న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో కేంద్రం సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ వంటి ఉన్నత స్థాయి అధికారులను దేశంలోని మొత్తం 765 జిల్లాలకు 'రత్'గా నియమించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 9న రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మరొక ఉత్తర్వును కూడా ఖర్గే తన లేఖలో ప్రస్తావించారు. వార్షిక సెలవుల్లో ఉన్న సైనికులు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి తమ సమయాన్ని వినియోగించాలని ఈ ఉత్తర్వుల్లో కోరారు. ఈ విధమైన ఉత్తర్వులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ 1964ను స్పష్టంగా ఉల్లంగించడమే అని ఖర్గే తెలిపారు. పైన పేర్కొన్న రూల్స్ ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని నిర్దేశిస్తున్నాయి. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ అధికారుల్ని అధికార పార్టీ రాజకీయ కార్యకర్తలుగా మారుస్తాయని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రచారానికి ఉన్నతస్థాయి అధికారుల్ని వినియోగిస్తే రాబోయే ఆరు నెలల పాటు దేశ పాలన ఆగిపోతుందని తెలిపారు. మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి పై ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవడం అత్యవసరమని ఖర్గే తన లేఖలో తెలిపారు. ప్రధానికి తాను రాసిన లేఖను ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు దేశంలోని రాజకీయ పార్టీలకు మాత్రమే కాకుండా ప్రజలకు కూడా ఆందోళన కలిగించే విషయంగా ఖర్గే తెలిపారు.
ప్రజాస్వామ్యంలో సాయుధ బలగాలను రాజకీయాలకు దూరంగా ఉంచడం అత్యంత కీలకమని ఖర్గే తెలిపారు. ప్రతి సైనికుడు తన దేశం, రాజ్యాంగం పట్ల విధేయతగా ఉంటారని, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని సైనికులను బలవంతం చేయడం ప్రమాదకరమైన అడుగుగా ఖర్గే విమర్శించారు. 'ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో పాటు, ఆదాయపు పన్ను శాఖ, సిబిఐ ఇప్పటికే బిజెపికి ఎన్నికల విభాగాలుగా పనిచేస్తున్నాయి. పైన పేర్కొన్న ఉత్తర్వులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేసేలా చేస్తున్నాయి' అని కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.