Jun 10,2023 22:03

అమెజాన్‌ అడవుల్లో 40 రోజుల క్రితం ఓ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడినా.. అడవిలో తప్పిపోయారు. ఎట్టకేలకు వారిని అధికారులు సజీవంగా గుర్తించారు.

బొగొట (కొలంబియా) : 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ, ఓ తల్లి, గైడ్‌, పైలెట్‌ కలిసి విమానంలో వెళుతున్నారు. సాంకేతిక సమస్య కలిగి ఆ విమానం ప్రమాదానికి గురయ్యింది. 40 రోజులైపోయింది.. అధికార సిబ్బందికి తల్లి, గైడ్‌, పైలెట్‌ ల మృతదేహాలు కనిపించాయి.. ఆ నలుగురు పిల్లలు మాత్రం సజీవంగా ఉన్నారు..! దట్టమైన చెట్లతో.. క్రూర మృగాలతో భయానకంగా ఉండే అమెజాన్‌ అడవిలో ఆ నలుగురు పిల్లలు సజీవంగా ఉండటం.. ఆశ్చర్యానికి గురిచేసింది. '' అడవే వారిని రక్షించింది.. వారు అడవి పిల్లలు '' అని కొలంబియా ప్రజలంతా హర్షాన్ని వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే .... అమెజాన్‌ అటవీ ప్రాంతం పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటో తేదీన విమానం బయలుదేరింది. ఆ విమానంలో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్‌, పైలట్‌ ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్‌ ప్రకటించాడు. అనంతరం ఆ విమానం రాడార్‌ నుంచి కనిపించకుండాపోయింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. క్షతగాత్రులను కాపాడేందుకు సైన్యాన్ని పంపారు. 'ఆపరేషన్‌ హౌప్‌' పేరిట దట్టమైన అడవుల్లో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16 న విమాన శకలాలను సిబ్బంది గుర్తించారు. అందులో పైలట్‌, చిన్నారుల తల్లి, గైడ్‌ మృతదేహాలను గుర్తించారు. అయితే విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద స్థలంలోవారు కన్పించకపోవడంతో చిన్నారుల కోసం చుట్టుపక్కల గాలించారు. దాదాపు 150 మంది సైనికులు, జాగీలాలతో అమెజాన్‌ అడవిని జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే మే 18వ తేదీన పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్‌, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. దీంతో పిల్లలు అడవుల్లోనే ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

                                                     40 రోజుల తరువాత సజీవంగా ఆ నలుగురు చిన్నారులు ...

ఎట్టకేలకు, ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించారు. గాలింపు బృందాలు వారి వద్దకు చేరుకునేసరికి నలుగురు పిల్లలు ఒంటరిగానే ఉన్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే క్రూరమృగాలు తిరిగే ప్రాంతంలో ఇన్ని రోజులుగా ఆ చిన్నారులు తమను తాము ఎలా కాపాడుకున్నారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అడవుల్లో అక్కడక్కడా హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పడేశారు. అవే ఆ చిన్నారులకు సాయం చేశాయని అధికారులు భావిస్తున్నారు.

                                                           వారు కొలంబియాకు కూడా వారసులే : దేశాధ్యక్షుడు

ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కన్పించడంతో కొలంబియాలో హర్షం వ్యక్తమయ్యింది. సైనికులతో చిన్నారులు ఉన్న దృశ్యాలను కొలంబియా మిలిటరీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. '' మా ప్రయత్నాలు ఫలించాయి '' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ దఅశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ''ఈ అడవే వారిని రక్షించింది. వారు అడవి పిల్లలు. మా కొలంబియాకు కూడా వారసులే '' అని ఆ దేశ అధ్యక్షుడు పెట్రో సంతోషం వ్యక్తం చేశారు.