
- తవ్విన తెల్లరాయిని అడవుల్లోనే వదిలివెళ్లిన మాఫియా
- ఈటాచీలు, జెసిబిలు, టిప్పర్లు, లారీలను ప్రత్యేక ప్రాంతాల్లో దాచిపెట్టిన వైనం
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : సైదాపురంలో వైట్ స్టోన్స్ (ఎస్‌డబ్లుఎస్) మాఫియాపై 'నెల్లూరులో కెజిఎఫ్' పేరుతో ప్రజాశక్తి'లో ఆదివారం ప్రచురితమైన కథనంపై అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చ సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా కొందరు రాజకీయనేతలు, అధికారుల సహకారంతో దేశ సరిహద్దులు దాటిపోతోన్న తెల్లరాయి వ్యవహారం బయటకొచ్చింది. దీనిపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీయడంతో స్థానిక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అక్రమ తవ్వకందారులు శనివారం మధ్యాహ్నం సమయానికి ఎక్కడ సరుకు అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఎస్‌బి అధికారులు మాఫియాపై దృష్టి పెట్టినట్లు సమాచారం. దీంతో, ఈ వ్యవహారం తమ పీకకు చుట్టుకుంటుందోమోనని ఆందోళనతో స్థానిక అధికారులు ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల దృష్టి సారించడంతో అక్రమ రవాణాకు మఫియా కొంత బ్రేక్ ఇచ్చింది. ఎక్కడ లారీలు అక్కడే నిలిచిపోయాయి. అటవీ, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేస్తున్న ఈటాచీలు, జెసిబిలు, టిప్పర్లు, లారీలను దగ్గరోని ప్రత్యేక ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువైన రాయి తరలించడానికి సిద్ధం కాగా, ఈ పరిస్థితుల్లో ఎలా తరలించాలనే విషయమై మాఫియా ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. తవ్వకాలు చేసిన బండరాళ్లను ఎక్కడక్కడే వదిలేశారు. తమ వద్ద ఉన్న నిల్వలు ఎలా తరలించాలనే విషయంపై ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. అన్ని శాఖల అధికారులకూ సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైదాపురంలో ఏం జరుగుతోంది? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న ఈ వ్యవహారం బయటకు రావడం, వేల కోట్ల కుంభకోణం కావడంతో స్థానిక అధికార యంత్రాంగం గుంబనంగా ఉంది. ఫోన్లకు అందుబాటులోకి రావడం లేదు. మైనింగ్, అటవీ, శాఖ అధికారులు తమ చేతుల్లో ఏం లేదని, తాము ఏమి చేయగలమని అంటున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉండడం, భారీగా తాయిలాలు అందడంతో ఏ ఒక్కరూ ఈ విషయాల గురించి మాట్లాడడం లేదు. అటవీ శాఖ భూముల్లోకి ఎవరు వెళ్లాలన్నా భయపడిపోతారు. చట్టాలు అంత కఠినంగా ఉంటాయి. అటవీ భూముల్లో తెల్లరాయి తవ్వుకుపోతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ అధికారులు లెస్సెన్స్ తనిఖీ చేయాలి. రెవెన్యూ అధికారులు నిత్యం పరిశీలన జరపాలి. ఇంత పెద్ద కుంభకోణం సాగుతున్నా ఇటువంటివి ఏమీ జరగడం లేదు. వందలాది టిప్పర్లు, లారీలు, 500 ఈటాచీలు ఇక్కడ కలియ తిరిగినా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ కుంభకోణం బయటకు రావడంతో ఇప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చిప్‌గా ఉన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 50 మైనింగ్ డీలర్ లెసెన్స్ (ఎండిఎల్) యాడ్స్ ఉన్నాయి. పెద్దపెద్ద రాళ్లను ఇక్కడే చిన్నచిన్న ముక్కలుగా చేసి, లారీల్లో సైదాపురం నుండి చెన్నెరుకు తరలిస్తుంటారు. ఒక్కో యాడ్ వద్ద సుమారు 500 టన్నుల వరకు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. అడుగు రాయిని పౌడర్ చేసి ఒక్కో టన్ను బస్తాల్లో నింపుతారు. ఈ పౌడర్ తయారు చేయడానికి సైదాపురంలోని జోగేపల్లిలో రెండు, ఊటు కూరులో 2, పెరుమళ్లపాడులో 3, చాగణంలో మరో 3 ఫ్యాక్టరీ ఉన్నాయి. ఇక్కడ వందల టన్నుల పౌడర్ నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.