Jul 27,2023 15:00
  • సిఐటియు, రైతు సంఘం డిమాండ్‌

ప్రజాశక్తి - పిచ్చా టూరు (తిరుపతి) : తిరుమల- తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని గత వెయ్యి రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు, ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పిచ్చాటూరులో వారికి సంఘీభావంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్ధన్‌, సిఐటియు మండల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. టిటిడి ఫారెస్ట్‌ విభాగంలో పనిచేస్తున్న 360 మంది కార్మికులలో కొందరిని పర్మినెంట్‌ చేసిన టిటిడి యాజమాన్యం మిగిలిన రెండు వందల మంది వరకు కాంట్రాక్టర్‌ కార్మికులుగానే వదిలేసి న వారిని కూడా పర్మినెంట్‌ చేయాలని గత వెయ్యి రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా కూడా పట్టించుకోలేదని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు విభాగంలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టైం స్కేల్‌ వేతనమైన ఇవ్వాలని వారు సుదీర్ఘ ఆందోళన చేస్తున్న కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నిత్యం కార్మికుల సమస్యలకు వైసిపి ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్న కూడా ధర్మాన్ని కాపాడే దేవస్థానం అధర్మంగా వ్యవహరించడం అన్యాయం అన్నారు. కొందరు కార్మికుల పట్ల వివక్ష చూపడం అంతకంటే దారుణం మరెక్కడా ఉండదని విమర్శించారు .వివక్షకు తావు లేకుండా ఆందోళన చేస్తున్న కార్మికులను కూడా రెగ్యులర్‌ చేయాలని తక్షణమే వారి సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ తహశీల్దార్‌ సుదర్శనంకు వినతి పత్రాన్ని అందించారు.