
న్యూఢిల్లీ : 1980వ సంవత్సరపు అటవీ చట్టంలో చేసిన సవరణలు తప్పుదోవ పట్టించేవిగా, లోపభూయిష్టంగా ఉన్నాయనీ, వాటిని ఆమోదించొద్దని వంద మందికి పైగా మాజీ సీనియర్ అధికారులు పార్లమెంట్ సభ్యులను కోరారు. అటవీ (సంరక్షణ) సవరణ బిల్లును మార్చిలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దానిని పార్లమెంట్ సంయుక్త కమిటీకి నివేదించారు. గతవారం దానిని కమిటీ ఆమోదించింది. అయితే కమిటీలోని 31 మంది సభ్యుల్లో 18 మంది అధికార బీజేపీకి చెందిన వారే. దీంతో మందబలంతో అధికార పార్టీ దానికి ఆమోదముద్ర వేయించుకుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు వ్యూహాత్మక, భద్రతా సంబంధమైన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేస్తుందని, వాతావరణ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతున్నది. అయితే అటవీ భూములను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి ఈ బిల్లు ఉపకరిస్తుందని ప్రతిపక్షాలు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అటవీ భూమిలో భద్రతా సంబంధమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఈ సవరణ బిల్లు చెబుతున్నది. అయితే ఈశాన్య ప్రాంతం, హిమాలయ ప్రాంతంలోని అధిక భాగం పర్యావరణ పరంగా సున్నితమైనదని, ఆ ప్రాంతాలు పలు వన్యప్రాణులకు ఆవాసాలుగా ఉన్నాయని, ఈ సవరణ బిల్లు కారణంగా వాటి జీవనానికి భంగం కలుగుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సవరణ బిల్లుపై ఆందోళన వ్యక్తంచేస్తూ 105 మంది మాజీ అధికారులు ఎంపీలకు లేఖలు రాశారు. అటవీ భూమిని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తోందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన షరతులకు లోబడే అటవీ భూముల సర్వే జరుగుతుందని వారు గుర్తుచేశారు. ఫలితాన్ని ముందే నిర్ణయించుకొని చేసే సర్వేల వలన ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ఒకవేళ అడవిలో ఏవైనా ఖనిజాలు ఉన్నాయని తేలితే అక్కడ మైనింగ్‌కు అనుమతిస్తారా అని కూడా ప్రశ్నించారు. బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదించవద్దని వారు పార్లమెంట్ సభ్యులను కోరారు.