Aug 18,2023 17:07

న్యూఢిల్లీ :   రాజ్యసభలోని మొత్తం 225 మంది సిట్టింగ్‌ ఎంపీలలో, 75 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, మహిళలకు వ్యతిరేకంగా నేరాలపై నలుగురు ఎంపీలు విచారణను ఎదుర్కొంటున్నారని, వీరిలో అత్యధికంగా బిజెపి ఎంపిలు ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. 233 మంది రాజ్యసభ సభ్యులలో 225 మంది నేర వివరాలను విశ్లేషించి, అప్‌డేట్‌ చేసినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ (ఎడిఆర్‌) మరియు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (న్యూ) లు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉండగా, మరో ముగ్గురు ఎంపిల వివరాలు అందుబాటులో లేవని తెలిపింది. నాలుగు జమ్ముకాశ్మీర్‌ స్థానాలపై అనిశ్చితి నెలకొందని వివరించింది.

మొత్తం 225 మంది రాజ్యసభ ఎంపిల్లో 75 మంది వివరాలను విశ్లేషించగా.. 33 శాతం మంది ఎంపిలపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. రాజ్యసభ సిట్టింగ్‌ ఎంపిల్లో 18 శాతం మంది (41 మంది) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఇద్దరు ఎంపిలపై హత్య కేసులు (ఐపిసి 302) కూడా ఉన్నాయని పేర్కొంది. నలుగురు ఎంపిలపై మహిళలకు సంబంధించిన క్రిమినల్‌ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిలో అత్యధికంగా 23 మంది బిజెపి ఎంపిలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

మహారాష్ట్రకు చెందిన 19 మంది ఎంపిల్లో 12 మంది (63శాతం), బీహార్‌ నుండి 16 మందిలో పది మంది (63శాతం), యుపి నుండి 30 మందిలో ఏడుగురు (23 శాతం), తమిళనాడుకు చెందిన 18 మందిలో (33 శాతం), కేరళకు చెందిన తొమ్మిది మందిలో ఆరుగురు (67 శాతం), పశ్చిమబెంగాల్‌కు చెందిన 16 మందిలో ఐదుగురు (31శాతం) తమ అఫిడవిట్‌లలో తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు.