న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఆదివారం ఉదయం నూతన పార్లమెంట్ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. సోమవారం నుండి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకరోజు ముందు నూతన పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం ఎదుట జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు పార్లమెంటులో విధులు నిర్వహించే సిఆర్‌పిఎఫ్ బృందం వేర్వేరుగా గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదో చారిత్రక క్షణమని, నూతన యుగపు మార్పుకు భారత్ సాక్షిగా నిలుస్తోందని కార్యక్రమం అనంతరం ధన్‌ఖర్ మీడియాతో అన్నారు. భారత దేశ శక్తి, సహకారాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందని అన్నారు. అలాగే నేడు అఖిల పక్ష సమావేశం కూడా జరగనుంది.
ఆలస్యంగా ఆహ్వానం : ఖర్గే అసంతృప్తి
అయితే ఆలస్యంగా సమాచారం ఇచ్చిన కారణంగా తాను ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. తనకు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం సమాచారం వచ్చిందని ఖర్గే రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి.మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలు జరుగుతున్నాయి.