
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అడవుల సంరక్షణపై సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దానిని ఆమోదించవద్దని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోనూ, 16 రాష్ట్రాలలోనూ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజలు, వాతావరణ పరిరక్షణ బృందాల సభ్యులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలకు హాజరయ్యారు. నిరసనకారులు 'భారత అడవులను కాపాడండి' నినాదంతో ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రచారం చేపట్టారు. బిల్లును ఆమోదించవద్దని రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులను కోరుతూ ఇ-మెయిల్ సందేశాలు కూడా పంపారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఛత్తీస్‌ఘర్‌లోని హాస్‌డియోతో పాటు కొల్‌కతా, విశాఖపట్నం నగరాలలో ప్రదర్శనలు జరిగాయి.