Oct 03,2023 10:24
  • సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల, సమాఖ్యల సంయుక్త వేదిక పిలుపు

న్యూఢిల్లీ : 2021 అక్టోబర్‌ 3న లఖింపూర్‌ ఖేరీలో రైతుల హత్యాకాండలో ప్రధాన కుట్ర దారైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తెనీని తక్షణమే పదవి నుంచి తొలగించి, ప్రాసిక్యూట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా మంగళవారం బ్లాక్‌ డే నిర్వహించాలని సంయుక్త కిస్తాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యల సంయుక్త వేదిక పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు ప్రదర్శనలు నిర్వహించడం, దిష్టి బొమ్మలు తగలబెట్టడం, జిల్లా, తహసిల్‌ కేంద్రాల స్థాయిల్లో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం చేయనున్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యల సంయుక్త వేదిక తరపున న్యూఢిల్లీలోని తల్కటొరా స్టేడియంలో ఆగస్టు 24న జరిగిన అఖిల భారత రైతులు, రైతు కూలీల సదస్సు ఈ బ్లాక్‌ డే కు పిలుపునిచ్చింది. లఖింపూర్‌ ఖెరి దాడిలో నలుగురు రైతులు చనిపోవడం వెనుక మంత్రి ఆయన కుమారుడు అశీష్‌ మిశ్రా పాత్ర వుందని, వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జరిగిన ఐక్య రైతు ఆందోళనను అణచివేయడానికి బిజెపి పన్నిన కుట్ర ఇదని ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. గత రెండేళ్లలో ప్రధాని మోడీ అజరు మిశ్రాను డిస్మిస్‌ చేయడం కానీ, రాజీనామా చేయాలని కోరడం గానీ జరగలేదు. ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి పేరు వున్నప్పటికీ ప్రధాని ఆయనను రక్షిస్తున్నారని ఆయా సంఘాలు విమర్శించాయి. సుప్రీం జోక్యం తర్వాతనే యుపి ప్రభుత్వం అశీష్‌ మిశ్రాను, ఇతర నిందితులను అదుపులోకి తీసుకుందని, వారితో పాటూ అమాయకులైన రైతులను కూడా అరెస్టు చేశారని పేర్కొంది. ప్రజాస్వామ్య రీతిలో ఉద్యమాలు జరుపుతున్న వారిపై జరిగే అణచివేత, దాడులకు నిరసనగా బ్లాక్‌డే పాటిస్తున్నట్లు ఎస్‌కెఎం, సంయుక్త వేదిక పేర్కొన్నాయి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాయి. చారిత్రక రైతు పోరాటం సందర్భంగా రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఇప్పటికైనా ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి.