
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో చోటుచేసుకుంటున్న అమానుష దారుణాలపై దేశవ్యాప్తంగా నిరసనాగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆడ తల్లులపై అఘాయిత్యాలకు పాల్పడి నగంగా ఊరేగించిన దారుణాలపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది. 'డబుల్ ఇంజిన్' సుపరిపాలన అంటే ఇదేనా అంటూ కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాల తీరుపై సామాన్య ప్రజానీకం మండిపడుతోంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర ప్రజాసంఘాల నేతృత్వంతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దేశ రాజధానితో పాటు అసేతుహిమచలం వివిధ రూపాల్లో ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వమే ఉంటే సుపరిపాలన అందిస్తామంటూ 'డబుల్ ఇంజిన్' గొప్పలు చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్‌లో హింసాకాండ మొదలైన 79 రోజుల తర్వాత పార్లమెంటు వెలుపల మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటు అని ఆందోళనల్లో పాల్గొన్న ప్రజలు నినదించారు. బిజెపి కుట్రలకు బలైపోతున్న మణిపూర్ ప్రజానీకానికి సంఘీభావం తెలియజేశారు. కాగా మణిపూర్ మారణకాండపై పూర్తిస్థాయిలో చర్చ చేపట్టాలని పార్లమెంటులో రెండో రోజూ ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు. అయితే అందుకు ససేమిరా అంటూ మోడీ సర్కార్ వెన్నుచూపింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తోంది. మణిపూర్ అల్లర్లు, తాజాగా వెలుగులోకి వచ్చిన మహిళలపై అమానుషం ఘటనపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగడంతో ఉభయసభలు అట్టుడికాయి. ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ఉభయసభలు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడ్డాయి. మంగళవారం ఉభయసభలు ప్రారంభానికి ముందే మణిపూర్ హింసపై చర్చించాలని కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిఆఎర్‌ఎస్, టిఎంసి సహా ఇతర పార్టీలు వాయిదా తీర్మాన నోటీసులిచ్చాయి. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ అనుమతించ లేదు. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రధాని మోడీ సభలో సమాధానం చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తరువాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
రాజ్యసభలో రూల్ నెంబర్ 267 కింద చర్చకు ప్రతిపక్షాల పట్టు
ఇతర సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి రూల్ 267 కింద మణిపూర్ సమస్యపై పూర్తిస్థాయిలో చర్చించాలని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. నిబంధన 176 కింద తక్కువ సమయం చర్చకు కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ 'మణిపూర్ ఘటన చాలా తీవ్రమైనదని, మణిపూర్‌లో ఘటన యావత్ దేశం సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ప్రధాని స్వయంగా చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించాలని ప్రభుత్వం కోరుతోంది. అయినా ప్రతిపక్షాలు చర్చ జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు సీరియస్‌గా లేవని భావిస్తున్నా' అని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చకు కేంద్రం సిద్ధమేనని, ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కన పెట్టి.. మణిపూర్ అంశంపై మాత్రమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ '' మేం రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చాం. కాబట్టి పార్లమెంట్‌లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కకు పెట్టి, మణిపూర్ ఘటనపై చర్చ జరగాలి. ఈ అంశంపై కేవలం అరగంట చర్చ సరిపోదు. మణిపుర్ సిఎం తక్షణమే రాజీనామా చేయాలి. అక్కడ రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నాం'' అని తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ.. ''ప్రతిపక్షాలు ప్రధాని పార్లమెంట్‌కు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ చర్చకు అవకాశం కల్పించడంలేదు'' అని అన్నారు.
ప్రతిపక్షాల ఆందోళన నడుమ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో కూడా ఎటువంటి మార్పు రాలేదు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. 1990 నుండి 2016 వరకు 11 సార్లు వివిధ చర్చల కోసం ఈ నిబంధనను వినియోగించినట్లు పార్లమెంటరీ రికార్డులు చూపిస్తున్నాయి. చివరిసారిగా 2016లో అప్పటి ఛైర్మన్ హమీద్ అన్సారీ ''పెద్ద నోట్ల రద్దు'' పై చర్చకు అనుమతించారు. తనకు ముందు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించిన వెంకయ్యనాయుడు ఆరేళ్ల పదవీ కాలంలో ఈ నిబంధనను అమోదించలేదని ప్రస్తుత చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ పేర్కొన్నారు.